రైతులు ‘ఖలిస్తానీయులు, మావోయిస్టులట’, రెచ్చిపోయిన బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ పై ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Nov 30, 2020 | 3:55 PM

రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య రగడ మొదలైంది. భారీ సంఖ్యలో అన్నదాతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలకు  దిగుతుండగా వీరికి ఖలిస్తానీయులతోను, మావోయిస్టులతోను లింక్ ఉందని బీజేపీ..

రైతులు ఖలిస్తానీయులు, మావోయిస్టులట, రెచ్చిపోయిన బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ పై ఫైర్
Follow us on

రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య రగడ మొదలైంది. భారీ సంఖ్యలో అన్నదాతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలకు  దిగుతుండగా వీరికి ఖలిస్తానీయులతోను, మావోయిస్టులతోను లింక్ ఉందని బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా దుయ్యబట్టారు. రైతు చట్టాలను కేజ్రీవాల్ ప్రభుత్వం ఇదివరకే-అంటే గత నవంబరు 23 నే నోటిఫై చేసి అమలు చేయడం ప్రారంభించిందని, ఇప్పుడు ‘మావోయిస్టులు, ఖలిస్తానీయులు’ నగరంలో అడుగు పెట్టగానే ఈ నగరాన్ని తగులబెట్టే అవకాశాన్ని పరిశీలిస్తోందని అన్నారు. ఇది రైతుల పట్ల అభిమానం ఉండి కాదని, కేవలం రాజకీయమని అమిత్ మాలవీయ ఆరోపించారు. రైతుల శాంతియుత ఆందోళనను తాము అడ్డుకోబోమని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం విదితమే. అలాగే అన్నదాతలను అరెస్టు చేసి వారిని ఉంచేందుకు నగరంలోని 9 స్టేడియం లను జైళ్లుగా మార్చేందుకు అనుమతించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం తిరస్కరించింది.,

ఆందోళన చేస్తున్న అన్నదాతలను ఇటీవల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఖలిస్తానీయులుగా అభివర్ణించారు. వారిలో కొందరు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన విషయాన్ని తాను గమనించానన్నారు. లోగడ ఇందిరాగాంధీ పట్ల మేం ఆ పని చేయగాలేనిది ఇప్పుడు ఈ ప్రధాని మోదీ పై చేయలేమా అని అని వారు వ్యాఖ్హ్యానించినట్టు తనకు తెలిసిందన్నారు. 1984 లో నాటి ప్రధాని దివంగత ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డులే  హతమార్చారు. అయితే ఖట్టర్ వ్యాఖ్యలను పలు విపక్షాలు ఖండించాయి.