జెయింట్‌వీలంత పెద్ద గ్రహశకలం నిజంగానే భూమిని ఢీకొట్టబోతున్నదా?

| Edited By: Pardhasaradhi Peri

Jul 18, 2020 | 12:54 PM

మరికొద్ది రోజుల్లో ఓ గ్రహశకరం భూమిని ఢీకొట్టబోతున్నదని, దాంతో అపారనష్టం సంభవించబోతున్నదని బోలెడన్ని కథనాలు వస్తున్నాయి

జెయింట్‌వీలంత పెద్ద  గ్రహశకలం నిజంగానే భూమిని ఢీకొట్టబోతున్నదా?
Follow us on

ఇప్పటికీ కనీసం వెయ్యినొక్కసార్లు ఈ మాట విని ఉంటాం! అదే భూమి అంతం కాబోతుందదని, యుగాంతం రాబోతుందని, భూమి ఫెఠెల్మని పేలిపోతుందని వగైరా వగైరా… అలా చెబుతూనే ఉన్నారు.. భూమి మాత్రం నిక్షేపంలా అలాగే ఉంది.. ఎప్పటిలాగే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది.. ఇప్పుడు లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో భూమి అంతానికి సంబంధించిన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.. మరికొద్ది రోజుల్లో ఓ గ్రహశకరం భూమిని ఢీకొట్టబోతున్నదని, దాంతో అపారనష్టం సంభవించబోతున్నదని బోలెడన్ని కథనాలు వస్తున్నాయి..

ఇందులో పాక్షిక సత్యం ఉంది.. సెప్టెంబర్‌ ఒకటిన మన కాలమానం ప్రకారం ఉదయం 10.49 గంటలకు 2011 ES4 అనే గ్రహశకలం భూమికి దగ్గర్నుంచి వెళుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసా చెబుతోంది. ఎక్కువ దూరం నుంచేమీ కాదు.. జస్ట్‌ 44, 618 మైళ్ల దూరం నుంచే ఆ గ్రహశకలం వెళుతోంది.. మనిషి బుద్ధెరిగిన నాటి నుంచి చాలా గ్రహశకలాలు ఇలా భూమివైపు నుంచి వెళ్లాయి.. భూమికి కాని, భూమ్మీద నివసిస్తున్న జీవరాశులకు కాని ఎలాంటి నష్టమూ జరగలేదు.

తీవ్ర నష్టం వాటిల్లబోతున్నదా?

అలాగని 2011 ES4 గ్రహశకలం వల్ల ఎలాంటి నష్టమూ జరగదని గట్టిగా చెప్పలేమంటోంది నాసా. ఎందుకంటే మిగతా గ్రహశకలాలు, చంద్రుని కంటే దూరంగా వెళ్లాయి.. మనకు చంద్రుడు 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు.. ఈ గ్రహశకలం మాత్రం చంద్రుడి కంటే దగ్గర నుంచి భూమ్మీదుగా వెళ్లబోతున్నదట! ఇదే ఆందోళన కలిగిస్తున్నదట! ఆందోళన ఎందుకంటే చంద్రుడి కంటే దగ్గర భూమి వైపు నుంచి వెళుతుంది కాబట్టి ఈ గ్రహశకలాన్ని భూమి ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉండటమే!

నాసా పరిభాషలో చెప్పాలంటే భూమికి దగ్గరగా వచ్చే యాస్టిరాయిడ్స్‌ను నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్స్‌ అంటారు.. ఇవి తమ మార్గంలోనే పయనిస్తూ మధ్యలో ఏదైనా గ్రహం వస్తే దాని గురుత్వాకర్షణశక్తికి లోనవుతాయి.. ఫలితంగా తమ దిశ మార్చుకుని గురుత్వాకర్షణశక్తికి లోనైన గ్రహంవైపుకు వెళతాయి.. చంద్రుడు భూమి గురుత్వాకర్షణకు లోబడే ఉన్నాడన్న విషయం తెలుసు కదా! ఇప్పుడొస్తున్న గ్రహశకలం చంద్రుడి కంటే దగ్గరగా భూమి నుంచి వెళితే ఆటోమాటిక్‌గా భూమి గురుత్వాకర్షణశక్తికి లోనవుతుంది.. అదే జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.. 2011 ES4 గ్రహశకలం అంగారక, గురు గ్రహాల మధ్య ఉండే గ్రహశకలాలలో ఒకటి కావొచ్చంటోంది నాసా. ఇన్ని చెప్పిన నాసా ఓ చల్లని మాట కూడా చెప్పింది.. ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టేఛాన్స్‌ లేదంటోంది.. ఇదేం పెద్ద గ్రహశకలం కాదంటోంది.. దీన్ని ఆకర్షించేలోపే, ఇది భూ కక్ష్యను దాటి వేగంగా వెళ్లిపోతుందని చెబుతోంది. అంచేత నిశ్చితంగా ఉండొచ్చు..