డబ్బుతో నన్ను ఎవరూ కొనలేరు, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మమతకు కౌంటర్

| Edited By: Pardhasaradhi Peri

Dec 16, 2020 | 3:02 PM

ఈ అసదుద్దీన్ ఒవైసీని డబ్బుతో ఎవరూ కొనలేరని అన్నారు ఎంఐఎం అధినేత. .. ముస్లిం ఓట్లను చీల్చేందుకు హైదరాబాద్ నుంచి ఓ పార్టీని తేవడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందంటూ..

డబ్బుతో నన్ను ఎవరూ కొనలేరు, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మమతకు కౌంటర్
Follow us on

ఈ అసదుద్దీన్ ఒవైసీని డబ్బుతో ఎవరూ కొనలేరని అన్నారు ఎంఐఎం అధినేత. .. ముస్లిం ఓట్లను చీల్చేందుకు హైదరాబాద్ నుంచి ఓ పార్టీని తేవడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. ముస్లింల ఓట్లు ఆమె జాగీర్ గానీ, ఆస్తి గానీ కాదన్నారు. డబ్బుతో నన్ను కొనే మగాడు ఎవరూ పుట్టలేదు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, అర్థరహితమని పేర్కొన్నారు. ఆమె తన సొంత పార్టీ గురించి ఆలోచించుకోవాలని, ఆమె పార్టీ నుంచి చాలామంది నేతలు  బీజేపీలో చేరుతున్నారని ఒవైసీ చెప్పారు. బీహార్ ఓటర్లను మమత అవమానించారని, అలా అవమానానికి గురైనవారే తమ పార్టీకి ఓట్లు వేశారని ఆయన అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం 5 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెంగాల్ లో ముస్లిం ఓట్లను చీల్చేందుకు తామేమీ ప్రయత్నించడం లేదని ఒవైసీ పేర్కొన్నారు.

ముస్లిం ఓట్లను చీల్చేందుకు బీజేపీ ఏం చేస్తోందంటే..మమతా బెనర్జీ

ముస్లిం ఓట్లను చీల్చేందుకు బీజేపీ హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ కు ఓ పార్టీని తెచ్చెందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందని సీఎం మమతా బెనర్జీ నిన్న ఆరోపించారు. ఒవైసీ ఆధ్వర్యంలోని మజ్లీస్ పార్టీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా ఈ వ్యాఖ్య చేశారు.(బెంగాల్ ఎన్నికల్లోనూ తాము పోటీ చేస్తామని ఒవైసీ ఇదివరకే ప్రకటించారు.) మా రాష్ట్రంలో హిందూ ఓట్లను బీజేపీ, ముస్లిముల ఓట్లను ఎం ఐ ఎం కైవసం చేసుకునేందుకు చూస్తున్నాయని దీదీ అన్నారు. బీహార్ ఎన్నికల్లోనూ వారు ఇదే పని చేశారని, ఎం ఐ ఎం భారతీయ జనతా పార్టీ  ‘బీ టీమ్’ అని ఆమె దుయ్యబట్టారు.

బెంగాల్ లో దాదాపు 100 నుంచి 110 స్థానాల్లో ముస్లిం జనాభా ఉంది.  దీంతో మజ్లీస్ పార్టీ ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా మారింది. తమకు పట్టు ఉందని భావించిన సీట్లను ఈ పార్టీ చేజిక్కించుకుంటుందని తృణమూల్ కాంగ్రెస్ నాయకుల్లో ఓ వర్గం ఆందోళన చెందుతోంది. బెంగాల్  అసెంబ్లీ లోని 294 సీట్లకు వచ్ఛేఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.