Pacific Ocean: సముద్రపు అడుగులో డార్క్ ఆక్సిజన్‌.. సృష్టి రహస్యం తెలిసిపోతుందా..?

|

Jul 27, 2024 | 7:16 PM

సముద్రపు అడుగులో ఆక్సిజన్‌ ఉంటుందా.. ? ఉన్నా ఎలా సాధ్యం అన్నదానికి శాస్త్రవేత్తలు ఓ రహస్యాన్ని కనుగొన్నారు. కిరణజన్య సంయోగక్రియ లేకున్నా సముద్రగర్భంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతున్నట్టుగా గుర్తించారు. డార్క్‌ ఆక్సిజన్‌పై పూర్తి వివరాలు తెలిస్తే... సృష్టి రహస్యం బయటపడుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకోసం మైనింగ్‌ చేపడితే పర్యావరణానికే ప్రమాదమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Pacific Ocean: సముద్రపు అడుగులో డార్క్ ఆక్సిజన్‌.. సృష్టి రహస్యం తెలిసిపోతుందా..?
Ocean Surface
Image Credit source: Craig Smith and Diva Amon, ABYSSLINE Project
Follow us on

సముద్ర జీవ వైవిద్యాన్ని అంచనా వేసేందుకు జరుపుతున్న పరిశోధనలో.. కీలక రహస్యం వెలుగుచూసింది. ఇప్పటి వరకు సూర్యరశ్మి, మొక్కల ద్వారానే ఆక్సిజన్‌ ప్రొడ్యూస్‌ అవుతుందని తెలుసు. కానీ ఇవేమీ లేకుండానే సముద్ర గర్భంలోనే డార్క్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతున్నట్టుగా గుర్తించారు శాస్త్రవేత్తలు.

13వేల అడుగుల లోతులో కూడా ఆక్సిజన్‌ ఉన్నట్టుగా గుర్తించారు. అంటే సముద్రం లోపల ఐదు కిలోమీటర్ల లోతున ఈ ఆక్సిజన్‌ ఉంది. అంత లోతులో సూర్యరశ్మి, మొక్కలు లేనప్పటికీ ప్రాణవాయువు ఎలా ఉత్పత్తి అవుతుందన్న అనుమానంతో.. మరింత శోధించారు. అప్పుడు పాలీమెటాలిక్ నోడ్యూల్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆ నోడ్యూల్స్ సముద్రం నీటిలోని అణువులను హైడ్రోజన్‌, ఆక్సిజన్‌గా విడదీస్తాయి.

గవ్వలు, నత్తగుల్లలతో పాటు ఇతర శిథిలాలు సముద్రపు నీటిలో కరిగిన మెటల్స్‌ ద్వారా ఈ నోడ్యూల్స్ ఏర్పడ్డాయి. ఈ పక్రియకు వేల సంవత్సరాలు పడుతుందన్నారు శాస్త్రవేత్తలు. నోడ్యూల్స్ లో లిథియం, కోబాల్ట్‌, కాపర్‌ వంటి మెటల్స్‌ ఉంటాయి. ఇవన్నీ బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తారు. బ్యాటరీల్లా పనిచేయగల మెటల్‌ నోడ్యూల్స్.. ఆక్సిజన్‌ను కచ్చితంగా ఉత్పత్తి చేయగలవని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు.

అయితే సముద్రగర్భంలో ఉన్న నోడ్యూల్స్ కోసం మైనింగ్‌ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. మైనింగ్‌కు దిగుతున్నాయి. దీని వల్ల సముద్రజీవులకు హాని కలగడంతో పాటు ఆ ప్రాంతం దెబ్బతినే ప్రమాదముందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన మైనింగ్‌లను నిలిపివేయాలని 44 దేశాలకు చెందిన వందలాది మంది శాస్త్రవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..