
మాస్ మహరాజ్ రవితేజకి సాలిడ్ హిట్ ఇచ్చిన చిత్రం “ఇరుముడి”. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కథాంశంగా రూపొందిన ఈ చిత్రం గత ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ.. ఏకంగా రూ.150 కోట్లకు పైగా షేర్, రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది.
మరీ ముఖ్యంగా 105 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో కేవలం ఒకటిన్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వరుసగా 20 రోజుల పాటు రోజుకు కోటి రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు సాధించిన ఘనత కూడా ఈ మూవీకే సాధ్యమైంది. కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కనిపించగా.. కుమార్తెగా నక్షత్ర మెప్పించింది. హీరో రవితేజతో పాటు నక్షత్ర సహా మూవీలోని ప్రతి నటీనటులకు తమ నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. అలానే జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతానికి కూడా మంచి మార్కులు దక్కాయి. ముఖ్యంగా మల్లెపూల పల్లకి, ఇరుముడి, యాల యాలో పాటలు చాట్ బస్టర్లుగా నిలిచాయి.
అయితే ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అటు డైరెక్టర్ శివకి కూడా మజిలీ తర్వాత ఆ రేంజ్ హిట్ దక్కలేదు. దాంతో ఈ మూవీ హిట్ అంతా అయ్యప్ప స్వామి వల్లే అంటూ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానిస్తూ వచ్చారు.
ఇప్పుడు లేటెస్ట్ గా డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత రవిశంకర్ అయ్యప్ప దీక్ష స్వీకరించారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ప్రముఖ ఆలయంలో వీరిద్దరు దీక్షకు పూనుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ఇరుముడి సూపర్ హిట్ కావడం.. అంతా అయ్యప్ప కృప అంటూ భక్తి భావాన్ని చాటుకున్న వారు ఇప్పుడు దీక్షకు పూనుకొని నిరూపించుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం దేవుడి పేరు చెప్పినట్టు కాకుండా.. నిజ జీవితంలో కూడా భక్తి భావాన్ని కొనసాగించడం గొప్ప విషయం అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.