నేను ఏ పాపమూ ఎరుగను ః హాథ్రస్‌ ప్రధాన నిందితుడు

|

Oct 08, 2020 | 3:44 PM

సంచలనం సృష్టించిన హాథ్రస్‌ ఘటన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు అత్యాచారమే జరగలేదన్న పోలీసులు హడావుడిగా బాధితురాలికి అంత్యక్రియలు జరిపిన రోజు నుంచి ఇవాళ్టి వరకు నిందితుల తరఫున

నేను ఏ పాపమూ ఎరుగను ః హాథ్రస్‌ ప్రధాన నిందితుడు
Follow us on

సంచలనం సృష్టించిన హాథ్రస్‌ ఘటన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు అత్యాచారమే జరగలేదన్న పోలీసులు హడావుడిగా బాధితురాలికి అంత్యక్రియలు జరిపిన రోజు నుంచి ఇవాళ్టి వరకు నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకున్నవాళ్లు రోజుకొకరు వస్తున్నారు.. దళిత యువతపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను అత్యంత దారుణంగా హింసించి ఆమె మరణానికి కారణమైన ఘటనలో ప్రధాన నిందితుడు సందీప్‌ ఠాకూర్‌ కూడా ఇప్పుడు తప్పేమీ లేదని అమాయకంగా చెబుతున్నాడు.. పైగా బాధిత కుటుంబపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. చనిపోయిన అమ్మాయికి తనకు దగ్గర స్నేహితురాలని, తాము స్నేహంగా ఉండటం అమ్మాయి కుటుంబసభ్యులకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.. అందుకే ఆమెను తల్లి, సోదరులు కలిసి తీవ్రంగా కొట్టారని, ఆ గాయాలతోనే ఆమె చనిపోయిందని సందీప్‌ ఠాకూర్‌ అంటున్నాడు. ఆ ఘటన జరిగిన రోజు తాను అమ్మాయిని కలిసిన మాట నిజమే కానీ, ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదని చెప్పాడు. అనవసరంగా తమను ఈ కేసులో ఇరికించారని, సమగ్రంగా దర్యాప్తు జరిపితే ఎవరు దోషులో తేలుతుందంటూ హాథ్రస్‌ పోలీసులకు సందీప్‌ ఓ లేఖ కూడా రాశాడు. మేమిద్దరం తరచూ కలుసుకునేవాళ్లమని, ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవాళ్లమని సందీప్‌ అన్నాడు.. ఘటన జరిగిన రోజు కూడా ఆమెను కలిసేందుకు పొలం దగ్గరకు వెళ్లానని, అక్కడ వాళ్ల అమ్మ, సోదరులను చూసి వెనక్కి వచ్చేశానని సందీప్‌ చెబుతున్నాడు. ఆ తర్వాత వాళ్ల అమ్మ, సోదరులు ఆమెను తీవ్రంగా కొట్టినట్టు గ్రామస్తులు చెబితే విన్నానని అంటున్నాడు. స్నేహితురాలిపై తానేప్పుడూ చేయి కూడా చేసుకోలేదని, అలాంటిది ఇంతటి ఘాతుకానికి ఎలా ఒడిగడతానని సందీప్‌ తెలిపాడు. తామంతా అమాయకులమని, ఈ కేసును లోతుగా విచారించాలని లేఖలో ఎస్పీకి విన్నవించుకున్నాడు. హిందీలో రాసిన ఈ లేఖలో నిందితుడి వేలిముద్రలతో పాటు సహ నిందితుల వేలి ముద్రలు కూడా ఉన్నాయి..