భయం గుప్పిట్లో బతుకుతున్న హాథ్రస్‌ బాధితురాలి కుటుంబం

|

Oct 08, 2020 | 2:32 PM

ఓ దారుణమైన నేరం జరిగింది.. ఆ నేరానికి పాల్పడిన వారు గజగజమని వణికిపోవాలి.. కానీ హాథ్రస్‌లో నిందితులు హాయిగా ఉన్నారు.. బాధితులేమో భయపడుతున్నారు.. భయం నీడల్లో బతుకుతున్నారు..

భయం గుప్పిట్లో బతుకుతున్న హాథ్రస్‌ బాధితురాలి కుటుంబం
Follow us on

ఓ దారుణమైన నేరం జరిగింది.. ఆ నేరానికి పాల్పడిన వారు గజగజమని వణికిపోవాలి.. కానీ హాథ్రస్‌లో నిందితులు హాయిగా ఉన్నారు.. బాధితులేమో భయపడుతున్నారు.. భయం నీడల్లో బతుకుతున్నారు.. అసలు ఎందుకు బతకాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.. తమ గురించి, తమ కూతరు గురించి ప్రచారమవుతున్న నీలాపనిందలు బాధిస్తున్నాయని బావురుమంటున్నారు. అనుమానపు చూపులను, అసత్య కథనాలను భరించలేకపోతున్నామంటూ తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని అంటున్నారు.. ఆ సంఘటన తర్వాత తమకు చేదోడు వాదోడుగా నిలవడానికి గ్రామంలోని ఎవరూ ముందుకు రాకపోవడం అమితంగా బాధించిందని కన్నీరుమున్నీరవుతున్నారు. అనుక్షణం భయపడుతూ ఇక్కడ బతకలేమని, ఎక్కడికైనా దూరంగా వెళ్లి బతుకుతామని చెబుతున్నారు..
ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి బాధితురాలి కుటుంబసభ్యులకు భద్రత కల్పించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓకే చెప్పింది.. బాధితురాలి కుటుంబానికి మూడంచెల భద్రత కల్పించే పనిలో పడింది. హథ్రాస్‌లోని భూల్గరీ గ్రామంలోని బాధితుల ఇంటి ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. కుటుంబసభ్యులు ఒప్పుకున్నాకే కెమెరాలు పెట్టామని హాథ్రస్‌ జాయింట్‌ కలెక్టర్‌ ప్రేమ్‌ ప్రకాశ్‌ మీనా అన్నారు. ఒక్కొక్కరికి ఇద్దరు కానిస్టేబుళ్లతో భద్రత కల్పిస్తున్నామని చెప్పాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నవారిని పూర్తిగా చెక్‌ చేసిన తర్వాతే లోనికి పంపుతున్నామని తెలిపారు. హాథ్రస్‌ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు… అక్టోబర్‌ 8నాటికి బాధిత కటుంబానికి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారో తమకు చెప్పాల్సిందిగా యూపీ సర్కారును ఆదేశించిన సంగతి తెలిసిందే!