సన్యాసం, సర్వ సంగ పరిత్యాగం, అస్ఖలిత బ్రహ్మచర్యం వంటి పద్ధతుల ద్వారా మాత్రమే ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామా? పురాణ, ఆధునిక కాలాలకు చెందిన ఋషులు, మునీశ్వరులు, యోగులెవరూ ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, అగస్యుడు వంటి ఋషులంతా ఆధ్యాత్మిక జీవితంలో దాంపత్య జీవితం కూడా ఒక ముఖ్యమైన భాగం అని అనుభవపూర్వకంగా చెప్పారు. ఇదే విషయాన్ని పురాణాలు కూడా నిర్ధారిస్తున్నాయి. నారదుడు, విదురుడు వంటి మహా పురుషులు కూడా కుటుంబ జీవితాన్ని, సంసార జీవితాన్ని ముఖ్యంగా దాంపత్య జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితానికి సరైన మార్గంగా ప్రవచించినవారే. ఆధ్యాత్మిక జీవితంలో దాంపత్య జీవితానికి ఉన్నంత ప్రాధాన్యం మరి మరి ఏ జీవితానికి లేదని వారు తేల్చి చెప్పారు. నిజానికి పురాణ కాలంలో ఏ ఋషి, ఏ మునీశ్వరుడు సన్యాసం తీసుకోలేదు. వారంతా పరిపూర్ణ దాంపత్య జీవితం గడిపిన వారే.
అంతేకాదు, ఆధ్యాత్మికత కారణం గానే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటూ వస్తోందని, అది ఇన్ని వేల సంవత్సరాలుగా కొనసాగటానికి ఆధ్యాత్మికతే పునాది వేసింది అని ఇటీవల కాలంలో పరమహంస యోగానంద, లాహిరీ మహాశయ, మాస్టర్ సి వి వి వంటి యోగి పుంగవులు సైతం తమ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రపంచంలో విభిన్న ఆధ్యాత్మిక మార్గాలను సాధకులు అనుసరిస్తున్నప్పటికీ ఏ మార్గంలోనూ దాంపత్య జీవితాన్ని వ్యతిరేకించడం జరగలేదు. ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబ, దాంపత్య కోణం ఏ స్థాయిలో ఉందో అధ్యయనం చేసిన పలువురు పరిశోధకులు కుటుంబంలో వచ్చే అనేక సమస్యలకు, సవాళ్లకు, ఒత్తిళ్లకు ఆధ్యాత్మిక మార్గాల నుంచి పరిష్కారాలు వెతకడం సర్వసాధారణ విషయమని తేల్చి చెప్పారు. ఇక ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు, కష్టనష్టాలకు కుటుంబ జీవితంలో పరిష్కారాలు కనిపిస్తాయని కూడా చెప్పారు.
ఆధ్యాత్మిక జీవితానికైనా, సంసార జీవితానికైనా సహనం, ఓర్పు, ఆత్మవిశ్వాసం, నిబ్బరం, సానుకూల దృక్పథం వంటివి తప్పనిసరిగా అవసరం అవుతాయి. కుటుంబ జీవితంలోని బాధ్యతల నిర్వహణ, పిల్లల పెంపకం, క్రమశిక్షణ వంటివి ఆధ్యాత్మిక జీవితానికి పునాది రాళ్లు అవుతాయి. జీవితం నుంచి పారిపోవద్దని, సమస్యలను ఎదుర్కొంటూ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. తల్లిదండ్రులు మాత్రమే ఆధ్యాత్మిక జీవితాన్ని సునాయాసంగా గడపగలరని వారు అభిప్రాయపడుతున్నారు. సంసార జీవితంలో సమానత్వాన్ని పాటించడం, బాధ్యతలను నిర్వర్తించడం, ప్రేమను పంచడం వంటి లక్షణాలు ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి.