Pawan Kalyan: ప్రధాని మోడీ భీమవరం సభకు పవన్ డుమ్మా.. బీజేపీతో గ్యాప్ పెరుగుతోందా..? 

| Edited By: Shaik Madar Saheb

Jul 04, 2022 | 7:42 PM

సాక్షాత్తూ ప్రధాని స్వయంగా భీమవరానికి వస్తే మిత్రపక్షంలో ఉండి కూడా పవన్ కల్యాణ్ ఆ సభకు వెళ్లకపోవడం వెనుక వేరే ఏ కారణాలు లేవంటున్నారు జనసేన నాయకులు. ఒకవేళ నిజంగా ఆయన అంత బిజీగా ఉండి ఉంటే అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని కూడా వెళ్లగలరు.

Pawan Kalyan: ప్రధాని మోడీ భీమవరం సభకు పవన్ డుమ్మా.. బీజేపీతో గ్యాప్ పెరుగుతోందా..? 
Pawan Kalyan Pm Modi
Follow us on
Pawan Kalyan – PM Modi: భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు జనసేనాని హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు రాలేదనేదానిపై అన్ని పార్టీలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి. అసలు పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగానే రాలేదా..? లేదా ఆహ్వానం సరిగా లేదా..? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారని స్వయంగా పవన్ కల్యాణే చెప్పారు. అంతేగాదు కిషన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు కూడా చెప్పారు. కానీ సభకు మాత్రం హాజరు కాలేదు. ఏకంగా ప్రధానమంత్రి హాజరైన కార్యక్రమానికి రాలేనంత బిజీగా పవన్ కల్యాణ్ ఉన్నారా..? అంటే అదీ లేదు.. అంటే ఏదో జరిగింది.. ఇంకేదో జరగబోతోంది.. కమలంతో కటీఫ్‌కు జనసేనాని రెడీ అయ్యారనే ప్రచారం విపరీతంగా జరుగుతుండటం.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ కల్యాణ్ ఎందుకు అలిగారు
గత కొద్ది కాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పవన్ కల్యాణ్.. బహిరంగ వేదికలపైన సైతం ఆయన ఈ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. తనను ఇంతవరకూ సీఎం క్యాండిటేట్‌గా ప్రకటించలేదని స్వయంగా పవన్ కల్యాణే బహిరంగసభలో అన్నారు. ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత కూడా బీజేపీ నుంచి పెద్దగా స్పందన లేదు. బీజేపీ నేతలు కాకుండా వేరే నేతల్ని సీఎం క్యాండేట్‌గా ప్రకటించే సాంప్రదాయం బీజేపీలో లేదని కొంతమంది బీజేపీ నేతలు కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ బీజేపీతో తెగదెంపులు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే భీమవరంలో జరిగిన సభకు హాజరుకాకపోవడం ద్వారా తన కార్యకర్తలకు ఆయన సిగ్నల్ ఇచ్చారు. ఇక బీజేపీతో సంబంధాలు తెగినట్టేనని చెప్పకుండానే చేతల్లో చూపారు పవన్ కల్యాణ్. గతంలోనే ఆయన పొత్తులపై మూడూ ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఒకటి సింగిల్‌గా జనసేన పోటీ చేయడం లేదా బీజేపీతో కలిసి పోటీ చేయడం, లేదా బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేయడం.. ఇవాళ జరిగిన ఘటన ద్వారా ఆయన మూడో ఆప్షన్‌ను ఎంచుకున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన సింగిల్ గానే బరిలోకి దిగుతుందనే చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు టీడీపీతోనూ పొత్తుల అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగితే జనసేనకు పెద్దగా ఒరిగేదేమీ లేదనేది జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు చెబుతున్నమాట.. ముఖ్యంగా జనసేన వల్ల బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది తప్ప బీజేపీ వల్ల జనసేనకు సీట్లు పెరిగే అవకాశమే లేదనేది జనసేన ఆలోచన. అందులో భాగంగానే బీజేపీతో కటీఫ్ చెప్పేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ ఉన్న వేదికను పంచుకోవడం ఇష్టం లేదా..
సాక్షాత్తూ ప్రధాని స్వయంగా భీమవరానికి వస్తే మిత్రపక్షంలో ఉండి కూడా పవన్ కల్యాణ్ ఆ సభకు వెళ్లకపోవడం వెనుక వేరే ఏ కారణాలు లేవంటున్నారు జనసేన నాయకులు. ఒకవేళ నిజంగా ఆయన అంత బిజీగా ఉండి ఉంటే అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని కూడా వెళ్లగలరు. కానీ వెళ్లే ఉద్దేశం లేదు కాబట్టే వ్యూహాత్మకంగా ధ్యాంక్స్ చెప్పి కార్యక్రమం నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. మరోవైపు తాను తీవ్రంగా పోరాటం చేస్తున్న వైసీపీకి బీజేపీ మరింత దగ్గర అవుతుండడం కూడా జనసేనాని ఆగ్రహానికి కారణమవుతోంది. పేరుకు ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసినప్పటికీ ఆ కార్యక్రమం మొత్తం ఆర్గనైజ్ చేసింది ఏపీ ప్రభుత్వమే. అందులోనూ స్వయంగా ఏపీ సీఎం జగనే దగ్గరుండి గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రధానికి స్వాగతం పలికి ఆయనతో కలిసి హెలికాప్టర్‌లో వేదిక మీదకువచ్చారు. ఈ కార్యక్రమానికి తాను హాజరైతే ప్రజల్లో సంకేతాలు వేరే విధంగా వెళ్తాయనే కారణంతోనే పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు తాను చెప్పాలనుకున్నది ఈ మీటింగ్‌కు డుమ్మా కొట్టడం ద్వారా పవన్ కల్యాణ్ చేసిచూపినట్టు తెలుస్తోంది.
పాచిపోయిన లడ్డూల కథ రిపీట్ అవుతుందా..
2014లో జనసేన పార్టీ పెట్టాక ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు.. కానీ బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. అటు నరేంద్రమోడీ, ఇటు చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలో మూడు చోట్ల ఒకేరోజు బహిరంగ సభల్లో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. జోరు వర్షంలో తడుస్తూ కూడా మోడీతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత ఏపీలో టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కొంతకాలం ఈ ప్రభుత్వంతో పవన్ కల్యాణ్ కూడా మంచి సంబంధాలే మెయింటైన్ చేసారు. కానీ అనూహ్యంగా ఇటు టీడీపీకి,అటు బీజేపీకి దూరమయ్యారు పవన్ కల్యాణ్. సొంతమార్గంలో సింగిల్‌గా పయనించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందంటూ నరేంద్రమోడీని తీవ్ర స్థాయిలో విమర్శించారు పవన్ కల్యాణ్. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ తిరుపతి సభలో బహిరంగంగానే బీజేపీని విమర్శించారు. బీజేపీతో చాలా గ్యాప్ వచ్చేసింది జనసేనకు.. అంతేగాదు 2019ఎన్నికల్లో అటు టీడీపీతోనూ ఇటు బీజేపీతో ను ఎలాంటి పొత్తు లేకుండా బీఎస్పీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు పవన్ కల్యాణ్.
అయితే తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయిన ఆయన కేవలం ఒకే ఒక్క సీట్లో మాత్రం జనసేన ఎమ్మెల్యేను గెలిపించుకోగాలిగారు.. పూర్తి విశ్వాసంతో ఎన్నికల్లో దిగిన పవన్ కల్యాణ్ అత్యంత దారుణంగా దెబ్బతిన్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పవన్ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఎక్కడైతే బీజేపీని విమర్శించారు మళ్లీ అదే తిరుపతిలోనే తాను మళ్లీ బీజేపీతో కలుస్తానని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లడం.. బీజేపీ అగ్రనేతల్ని కలవడం-రెండుపార్టీలు మిత్రపక్షంగా మారిపోవడం జరిగాయి. కొంతకాలం వరకూ ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత  బాగానే కొనసాగింది. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు పవన్ కల్యాణ్. అయితే ఏమయిందో తెలియదు కానీ ఆ తర్వాత నుంచి మళ్లీ బీజేపీతో మళ్లీ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అటు బీజేపీ నేతలు కూడా పవన్ తో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.. అది ఏ స్థాయికి వెళ్లిదంటే ఏకంగా ప్రదాని కార్యక్రమానికి కూడా పవన్ కల్యాణ్ హాజరుకానంతవరకూ వెళ్లింది. ఒక విధంగా రెండు పార్టీల మధ్య కటీఫ్‌కు వరకూ సాగుతోందంటూ పలువురు పేర్కొంటున్నారు.

ఏపీ వార్తల కోసం