కేరళలో ఏనుగుల చిత్ర హింస…బాధ్యులకు ఏదీ శిక్ష ?

| Edited By: Pardhasaradhi Peri

Jun 08, 2020 | 12:06 PM

కేరళలోని పలక్కాడ్ జిల్లాలో ఇటీవల ఓ ఏనుగు మృతి దేశవ్యాప్త సంచలనంగా మారింది. పేలుడు పదార్థాలతో కూర్చిన కొబ్బరి చిప్పను తిని ఆ గజరాజం తీవ్రంగా గాయపడి మరణించింది...

కేరళలో  ఏనుగుల చిత్ర హింస...బాధ్యులకు ఏదీ శిక్ష ?
Follow us on

కేరళలోని పలక్కాడ్ జిల్లాలో ఇటీవల ఓ ఏనుగు మృతి దేశవ్యాప్త సంచలనంగా మారింది. పేలుడు పదార్థాలతో కూర్చిన కొబ్బరి చిప్పను తిని ఆ గజరాజం తీవ్రంగా గాయపడి మరణించింది. దీనిపై రాజకీయ నేతలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతరులు పెద్దఎత్థున నిరసనలు తెలిపి ఆ ఏనుగు మృతికి కారకులైనవారికి కఠిన శిక్షలు విధించాలని కోరారు. అయితే ఈ రాష్ట్రంలో ఏనుగులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి మావటీలు, ఇతరులు వాటిని చిత్రహింసల పాల్జేస్తున్నవారి విషయంలో మాత్రం నోరెత్తడం లేదు. ప్రభుత్వాలు కూడా వారిని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి. ఏనుగుల దారుణ మరణాలకు కారకులైవారిలో ఎంతమందికి శిక్షలు పడ్డాయంటే దానికి లెక్కలు లేవు. 2018 నాటి ఏనుగుల సెన్సస్ ప్రకారం కేరళలో 500 కి పైగా ఏనుగులున్నాయి. వీటిలో ఎక్కువగా గజరాజులను ఆలయ వేడుకల్లోనూ, ఊరేగింపుల్లోనూ వినియోగిస్తుంటారు. అడవుల్లో కలప దుంగలను తెచ్చేందుకు మరికొన్నింటిని వాడుతుంటారు. కానీ అవి తమ మాట వినేలా చూసేందుకు మావటీలు, ఇతరులు వాటికి ఆహారంగానీ, నీరు గానీ ఇవ్వకుండా గంటల తరబడి నిలబెడుతుంటారు. మరికొందరు భారీ ఇనుప గొలుసులతో వాటిని వారాల తరబడి కట్టేసి ఉంచుతారు. ఆ గొలుసులకున్న సూదుల్లాంటి భాగాలతో వాటి పాదాలకు గాయాలై అవి బాధ పడుతున్నా పట్టించుకోరు. రెండేళ్లుగా ఇలా చిత్ర హింసలకు గురై సుమారు 30 ఏనుగులు మరణించాయి. ఆలయాల్లో ఊరేగింపులకు వినియోగించే గజరాజులకు  భక్తులు, పూజారులు పాయసం, లడ్డూలు, నెయ్యి, జిలెబీలువంటివాటిని ఇస్తుంటారని, వాటిని తినడం వల్ల ఏనుగుల కడుపులో అల్సర్స్ వంటివి ఏర్పడుతాయని జంతు నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఒక విధంగా గజరాజుల మృతికి దారి తీస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా వీటిని దారుణంగా హింసిస్తున్నవారి పట్ల ప్రభుత్వాలు, అధికారులు ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోకుండా వదిలివేయడం ఘోరం !