అవకాశం ఇచ్చింది కోదండపాణినే.. బాలును ప్రోత్సహించింది మహదేవనే!

|

Sep 25, 2020 | 3:49 PM

బాలసుబ్రహ్మణ్యంతో తొలి పాటను పాడించింది ఎస్‌.పి.కోదండపాణినే అయినప్పటికీ .. కె.వి.మహదేవన్‌ బాగా ప్రోత్సాహం ఇచ్చారు.. ఎన్‌.టి.రామారావుకు బాలుతో తొలిసారిగా పాడించింది మహదేవనే! ఏకవీర సినిమాలో రామారావు అభినయించిన ఏ పారిజాతమ్ములివ్వగనో సఖి అన్న పాటను బాలు పాడారు..

అవకాశం ఇచ్చింది కోదండపాణినే..  బాలును ప్రోత్సహించింది మహదేవనే!
Follow us on

బాలసుబ్రహ్మణ్యంతో తొలి పాటను పాడించింది ఎస్‌.పి.కోదండపాణినే అయినప్పటికీ .. కె.వి.మహదేవన్‌ బాగా ప్రోత్సాహం ఇచ్చారు.. ఎన్‌.టి.రామారావుకు బాలుతో తొలిసారిగా పాడించింది మహదేవనే! ఏకవీర సినిమాలో రామారావు అభినయించిన ఏ పారిజాతమ్ములివ్వగనో సఖి అన్న పాటను బాలు పాడారు.. అలాగే నాగేశ్వరరావుకు కూడా తొలిసారిగా బాలు పాడింది మహదేవన్‌ సంగీతంలోనే! ఇద్దరు అమ్మాయిలు సినిమాలోని నా హృదయపు కోవెలలో అన్న పాట ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే…అలాగే బాలు సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో మహదేవన్‌ చాలా పాటలిచ్చారాయనకు! అంతెందుకు… ఎంజీఆర్‌కు మొదటిసారిగా బాలు స్వరాన్ని అందించిన ఘనత కూడా మహదేవన్‌దే! ఈ పాట వెనుక ఓ కథ ఉంది..

ఓరోజు ఎవిఎం స్టూడియోలో బాలు, ఎల్‌ఆర్‌ ఈశ్వరి డ్యూయట్‌ సాంగ్‌ రికార్డవుతోంది.. అదే స్టూడియోలో ఎంజీఆర్‌ సినిమా షూటింగ్‌ అవుతోంది.. షూటింగ్‌ గ్యాప్‌లో బయటకు వచ్చిన ఎంజీఆర్‌కు బాలు పాడుతున్న పాట వినిపించింది.. బాలు గొంతు నచ్చేసింది.. మర్నాడు బాలును పిలిపించుకున్నారు ఎంజీఆర్‌.. తను తీయబోయే అడిమైపెణ్‌ సినిమాలో ఆయిరం నిలవేవా అన్న పాట పాడలని చెప్పారు.. ఆ సినిమాకు సంగీత దర్శకుడు మహదేవనే! మరో పది రోజుల్లో పాట రికార్డింగ్‌ ఉందన్న టైమ్‌లో బాలుకు టైఫాయిడ్‌ ఫీవర్‌ వచ్చింది.. మంచం దిగలేని పరిస్థితి.. ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆల్‌రెడీ యూనిట్ జైపూర్‌కు వెళ్లింది.. అనుకున్న టైమ్‌కు షూటింగ్‌ జరపకపోతే అదనపు ఖర్చు అవుతుంది.. జ్వరంతో పాటు వచ్చిన సువర్ణ అవకాశం చేజారిపోయిందనే బాధ బాలుకి అదనంగా వచ్చి చేరింది. బాలుకి హై ఫీవర్‌ అని , మంచం దిగలేని పరిస్థితిలో ఉన్నాడని ఎంజీఆర్‌కు తెలిసింది.. బాలుకేమో జ్వరం నుంచి పూర్తిగా కోలుకోడానికి 20 రోజులు పట్టింది. అప్పుడు ఎంజీఆర్‌ మేనేజర్‌ వచ్చి బాలును కలిశాడు..పూర్తిగా కోలుకున్నట్టేనా..? రిహార్సల్‌కు వస్తావా? అని అడిగాడు.. ఇది వేరే పాట అయి ఉంటుందనుకుని రికార్డింగ్‌ స్టూడియోకి వెళ్లారు.. అక్కడ మహదేవన్‌ను కలిశారు. అక్కడే ఉన్న పుహళేంది బాలుతో ఆయిరం నిలవేవా పాట ప్రాక్టీసు చేయించారు..

రెండు రోజుల తర్వాత పాట రికార్డింగ్‌ అయ్యింది.. సుశీలతో కలిసి డ్యూయెట్‌ సాంగ్‌ అది! బాలు పాటపాడుతుంటే కొందరు రికార్డింగ్‌ రూమ్‌లోకి తొంగితొంగి చూస్తూ ఉన్నారట! వారెవరంటే ఎంజీఆర్‌తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు.. వారికెందుకంత ఆసక్తి అంటే.. బాలు అనే కుర్రవాడు బాగా పాడుతున్నాడు.. నా సినిమాలో అతడితో ఒకటో రెండో పాటలు పాడించండి అని ఎంజీఆర్‌ వారితో చెప్పారట! ఇది విన్న బాలు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. ఎంజీఆర్‌ దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.. దాంతో పాటు క్షమాపణలు.. క్షమాపణలు ఎందుకంటే తన వల్లే షూటింగ్‌ వాయిదా పడింది కాబట్టి.. దానికి ఎంజీఆర్‌ ఎమన్నారంటే… ‘ఈ పాటను నేను వేరే గాయకుడితో పాడించి షూటింగ్‌ పూర్తి చేయవచ్చు.. కానీ నువ్వు నాకు పాడుతున్నావని అందరికీ తెలిసిపోయింది.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాటను వేరే గాయకుడు పాడితే నీ పాట నచ్చలేదేమో అన్న అనుమానం అందరికి కలుగుతుంది.. నీ బంగారంలాంటి భవిష్యత్తు పాడవుతుంది.. అందుకే షూటింగ్‌ వాయిదా వేశాను’ అని భుజం తట్టి వెళ్లిపోయారు. ఎంజీఆర్‌ గొప్పమనసుకు ఈ సంఘటన ఓ ఎగ్జాంపుల్‌! అన్నట్టు ఈ పాట పాడిన బాలుకు బెస్ట్‌ సింగర్‌ అవార్డు వచ్చింది..