లాక్ డౌన్ ఓకే గానీ నిధుల మాటేంటి?.. మోదీతో జగన్

లాక్ డౌన్ ఓకే గానీ నిధుల మాటేంటి?..  మోదీతో జగన్

దేశంలో లాక్ డౌన్ పొడిగింపును ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా సమర్థించారు. అయితే.. వ్యవసాయోత్పత్తుల దిగుబడులు వస్తుండడంతోపాటు రాష్ట్రానికి పూర్తిగా ఆదాయం నిలిచిపోయినందున ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.

Rajesh Sharma

|

Apr 11, 2020 | 6:24 PM

దేశంలో లాక్ డౌన్ పొడిగింపును ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా సమర్థించారు. అయితే.. వ్యవసాయోత్పత్తుల దిగుబడులు వస్తుండడంతోపాటు రాష్ట్రానికి పూర్తిగా ఆదాయం నిలిచిపోయినందున ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. శనివారం ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సులో కరోనా కట్టడికి ఏపీలో చేపట్టిన చర్యలను వివరించారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నామన్నారు.

కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారని, కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ వ్యూహం కొనసాగుతోందని చెప్పారు జగన్. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించినట్లు చెప్పారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున కోవిడ్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. సమర్థవంతంగా క్వారంటైన్‌ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌సెంటర్లను ఏర్పాటుచేసుకున్నామని, ఇందులో 26వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని వివరించారు సీఎం.

దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక వహిస్తున్న వ్యవసాయ రంగం ప్రస్తుతం కునారిల్లిపోతోందని, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయిందని జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు. మార్గమధ్యంలో నిలిపి వేస్తారనే భయంతో 25 శాతం మించి ట్రక్కులు తిరగడంలేదని, దాంతో రవాణా స్థంభించిపోయిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని, వ్యవసాయోత్పత్తులను నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయం లేక, ఎగుమతులు జరగక ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోందని చెప్పారు.

రాష్ట్రంలో 1, 03, 986 పారిశ్రామిక యూనిట్లకుగాను కేవలం 7,250 మాత్రమే నడుస్తున్నాయని, పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడంకూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యాయని సీఎం వీడియో కాన్ఫరెన్సులో వివరించారు. పరిశ్రమలు నడవనప్పుడు… వారు జీతాలు చెల్లించగలరని ఎలా ఆశిస్తామని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి వుందని, సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తిందని ఆయన మోదీకి చెప్పారు.

దేశ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రధాని తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగానైనా నడవాలన్న తమ అభిప్రాయమని అన్నారు సీఎం జగన్. రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన మోదీని కోరారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu