తవుడును అంత తేలిగ్గా తీసిపారేస్తున్నారా.? కానీ, ఇది ఎన్నో పోషకాలకు నెలవు అంటున్నారు పోషకాహార నిపుణులు. పశువులకు దాణాగా ఉపయోగించే తవుడు ఎన్నో రోగాల తాట తీస్తుందట.
అవును, తవుడును కూడా తినవచ్చని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తవుడును నేరుగా తినలేకున్నా దాంతో టీ డికాషన్ తయారు చేసి తాగవచ్చునని అంటున్నారు.
ఎన్నో పోషకాలకు నెలవుగా ఉండే తవుడును తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు. తవుడులో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి.
ముఖ్యంగా ఫెరూలిక్ యాసిడ్, పి-కౌమారిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. తవుడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాపులను తగ్గించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి.
తవుడు వల్ల ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇందులోని పోషకాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసి రోగాలను తరిమేస్తాయి.
తవుడులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీంతో విరేచనం సాఫీగా అవుతుంది.
అలాగే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. తవుడును ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.