పీతలను డైట్‎లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?

06 October 2025

Prudvi Battula 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడం సహజం. అయితే ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ వాసులు ఈ వర్షాకాలంలో లభించే పీతలను కాల్చుకుని తింటే అలాంటి వ్యాధులు రావంటున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పీతలను తినే ట్రెండ్ బాగా పెరిగినఫీ. వీటితో ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వాతావరణ మార్పులు వల్ల తాగునీరులో కలుషితం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి.

వర్షాకాలంలో టైఫాయిడ్ సహా ఇతర జబ్బులు సీజనల్ వ్యాధులు వస్తే పీతలను అధికంగా తింటే తగ్గుముఖం పడతాయని నమ్ముతున్నారు.

వీటిని కాల్చుకుని, కర్రీలా చేసుకొని తినడం లేదా పీతలపై చిప్పలో ఉన్న ద్రావణాన్ని తాగడం వల్ల టైఫాయిడ్ తదితర వ్యాధులు తగ్గిపోతాయని అక్కడి వాళ్ల విశ్వాసం.

వీరు పీతలను ఎండ్రకాయలు అని అంటారు. వీటిని వాగులు చెరువుల వద్ద పట్టుకుని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

కొంతమంది ఉపాధి కోసం వర్షా కాలంలో ఈ ఎండ్రకాయల అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పీతలకు మంచి గిరాకీ కూడా లభిస్తోంది.

రోడ్లపై "టైఫాయిడ్ స్పెషల్" అనే బోర్డులు పెట్టి పీతల జోడిని రూ.150కి అమ్ముతున్నారు. కొంచెం పెద్దగా ఉంటె రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు.