ఇలా చేస్తే రోజూ పప్పు రుబ్బే పని లేకుండానే టిఫిన్ చేసుకోవచ్చు..!

Ravi Kiran

29  April 2026

ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లే హడావుడిలో పప్పులు నానబెట్టి, గ్రైండర్ పట్టడం అంటే పెద్ద పని కదా? ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలకు, వయసు మళ్ళిన వారికి ఇది చాలా కష్టమైన పని. మరి దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది.

ప్రతిరోజూ పప్పు రుబ్బే పని లేకుండా ఒకేసారి మినప్పిండిని మిల్లు పట్టించుకుని స్టోర్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ మినపగుళ్ళను తీసుకుని, కడగకుండా పొడి బట్టతో తుడిచి పిండి పట్టించుకోవాలి. ఈ పిండిని గాలి తగలని డబ్బాలో భద్రపరుచుకుంటే రెండు మూడు నెలల వరకు అస్సలు పాడవదు.

ఇక అందరికీ ఇష్టమైన క్రిస్పీ దోశల విషయానికి వస్తే, ఒక గ్లాసు మినప్పిండికి మూడు గ్లాసుల పొడి బియ్యం పిండిని కలపాలి. ఇందులో ఒక గరిటె పాత ఇడ్లీ పిండి కలిపితే దోశలు భలే రుచిగా వస్తాయి. ఈ మిశ్రమాన్ని కూడా రాత్రంతా పులియబెడితే హోటల్ స్టైల్ దోశలు ఇంట్లోనే వేసుకోవచ్చు.

దోశ వేసేటప్పుడు పెనం బాగా కాలిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వేడి తగ్గనివ్వాలి. మంటను లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేస్తూ కాల్చుకుంటే దోశలు మంచి రంగులో, క్రిస్పీగా వస్తాయి. ఇలా చేస్తే మీరు నానబెట్టిన పప్పుతో చేసిన దోశలకు ఏమాత్రం తీసిపోవు.

మీరు రెగ్యులర్ ఇడ్లీలు కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఒక కప్పు మినప్పిండికి రెండు కప్పుల సన్నటి ఇడ్లీ రవ్వ కలిపితే సరిపోతుంది. బిజీగా ఉండే టీచర్స్, ఐటీ ఎంప్లాయిస్, పెద్దవారికి ఈ పద్ధతి ఒక గొప్ప వరమని చెప్పాలి. శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా లభిస్తుంది.

ఈ పిండితో ఆరోగ్యకరమైన జొన్న ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె మినప్పిండిని తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా విస్క్‌తో కలుపుకోవాలి. మినప్పిండి నానిన తర్వాత, మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో, అదే గిన్నెతో మూడు గన్నెల జొన్న ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. 

ఈ పిండిని రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టి బాగా నాననివ్వాలి, అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఈ రవ్వను కూడా మూడు గంటల పాటు నానబెట్టాలి.

నీళ్లన్నీ గట్టిగా పిండేసి మినప్పిండిలో కలిపి రాత్రంతా పులియబెడితే ఉదయానికి పిండి సిద్ధమవుతుంది. మరీ మందంగా కాకుండా కాస్త పల్చగా ఇడ్లీలు వేసుకుంటే అవి ఎంతో సాఫ్ట్‌గా, తినడానికి రుచిగా ఉంటాయి.