31 October, 2025
Subhash
భారత టెక్ ప్రపంచంలో మరో పెద్ద అప్‌డేట్ వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన కొత్త అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ ద్వారా గూగుల్‌తో కొత్త భాగస్వామ్యం కుదుర్చుకుంది.
భారత మార్కెట్లో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, దేశీయ రిలయన్స్ సంస్థలు తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఇందులో భాగంగా, రెండు కంపెనీలు భారీ శుభవార్త ప్రకటించాయి. రూ. 35,100 విలువైన గూగుల్ ఏఐ ప్రో ప్లాన్, జెమిని యాప్‌లోని జెమిని 2.5 ప్రో మోడళ్లు ఉచితం.
రిలయన్స్ జియో కస్టమర్లకు 18 నెలల పాటు జెమిని 2.5 ప్రోను ఉచితంగా అందిస్తాయి. అక్టోబర్ 30 నుంచి ఈ ఉచిత ప్లాన్ అమల్లోకి వస్తుంది.
అయితే మొదట దీన్ని 18-25 ఏళ్ల వయసున్న కస్టమర్లకు ఇవ్వనున్నట్టు ఇరు సంస్థలు ప్రకటించాయి. అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.
ఆ తర్వాత దశలవారీగా మిగిలిన కస్టమర్లకూ విస్తరిస్తామని స్పష్టం చేశాయి. గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ద్వారా జియో యూజర్లు జెమిని యాప్‌లో గూగుల్ జెమిని 2.5 ప్రో ఏఐ మోడల్‌కు యాక్సెస్ పొందుతారు.
జెమిని కోడ్ అసిస్ట్, నోట్‌బుక్ ఎల్ఎం, జీమెయిల్, డాక్స్‌లో జెమిని సేవలు అందుతాయి. 2టీబీ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ ద్వారా యూజర్లు ఆండ్రాయిడ్‌లో గూగుల్ ఫోటోస్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్ చాట్‌ల బ్యాకప్ కోసం ఉపయోగించవచ్చు.
జియో వినియోగదారులు తమ ఫోన్‌లలోని మైజియో యాప్ నుంచి గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.