మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు.
రైస్ తినడం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. రైస్‌లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి.
ఇవి మనకు శక్తిని అందించడంతో పాటు, ఆరోగ్యంగా ఉంచుతాయని అంటున్నారు. కాబట్టి.. అన్నం తినడం మానొద్దని సూచిస్తున్నారు. బరువు తగ్గాలని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
బరువు తగ్గాలనుకునేవారు భోజనంలో అన్నంతోపాటు కూర సమానంగా తీసుకోవాలి. దీనివల్ల అన్నం తినటం తగ్గుతుంది. రైస్ తక్కువ తీసుకోవటం వల్ల శరీరంలో క్యాలరీలు పెరగవు.
అలాగే.. కూరలు, పప్పులలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయని సూచిస్తున్నారు.
భోజనం చేస్తున్నప్పుడు చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ఎందుకంటే.. తక్కువ భోజనంతోనే ఈ ప్లేట్లు నిండిపోతాయి. దానివల్ల ఎక్కువ తింటున్నామనే భావన మనసుకు కలుగుతుంది.
అలాగే ఆహారం తినేముందు ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల అన్నం తక్కువ తినే అవకాశం ఉంటుంది. దీంతో బరువు తగ్గుతారని నిపుణులంటున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు డైట్‌లో ప్రతిరోజూ సలాడ్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటంతోపాటు ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు అధికంగా ఉంటాయి.