ఏసీలో గంటల తరబడి ఉంటున్నారా? ముక్కు, చెవి, గొంతుకు ముప్పు పొంచి ఉంది!

29 May 2026

Rajashekher

ఎండల నుంచి ఉపశమనం కోసం ఏసీ ఉపయోగించడం మంచిదే కానీ, గంటల తరబడి ఏసీ గదిలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు.

ఏసీ గదిలో గాలి చాలా పొడిగా ఉండటంతో ముక్కులోని మ్యూకస్ పొర ఎండిపోతుంది. దీంతో ముక్కు సహజ రక్షణ శక్తి తగ్గుతుంది.

ముక్కు ఎండిపోవడం వల్ల జలుబు, తుమ్ములు, ముక్కు మూసుకుపోవడం, గొంతు గరగర వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.

ముక్కు, చెవి, గొంతు పరస్పరం అనుసంధానమై ఉండటంతో ముక్కులో ఒత్తిడి పెరిగితే చెవుల్లో కూడా ఇబ్బందులు కలుగుతాయి.

ఎక్కువసేపు ఏసీలో ఉంటే చెవులు మూసుకుపోయినట్లు అనిపించడం, ఒత్తిడి పెరగడం, తలనొప్పి రావడం జరుగవచ్చు. పిల్లలు, అలర్జీ లేదా సైనసైటిస్ ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారు.

ఏసీ ఫిల్టర్లు శుభ్రంగా లేకపోతే వాటిలో దుమ్ము, బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి అలర్జీలు, గొంతు ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఏసీ గాలి నేరుగా ముఖం లేదా శరీరానికి తగలకుండా చూసుకోవాలి. అలాగే గదిలో హ్యూమిడిఫైర్ లేదా ఇండోర్ ప్లాంట్స్ ఉంచితే తేమ నిల్వ ఉంటుంది.

ఏసీ ఉష్ణోగ్రతను 24–26 డిగ్రీల మధ్య ఉంచడం, ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ఆరోగ్యానికి మంచిది.

రోజూ కొంతసేపు సహజ గాలిలో గడపడం, ఎక్కువగా నీళ్లు తాగడం, ముక్కు లేదా గొంతు ఎండిపోతే ఆవిరి పట్టుకోవడం లేదా నాసల్ స్ప్రేలు వాడడం ఉపశమనం ఇస్తాయి.