వర్షాకాలంలో వచ్చే రోగాలకు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్ ఇది తెలుసా.?
07 June 2026
Jyothi Gadda
ప్రకృతి మనకు అందించే కాలానుగుణ పండ్లలో నేరేడు పండు చాలా ప్రత్యేకమైనది. నలుపు, ఊదా రంగుల కలయికలో ఉండే ఈ చిన్న పండు రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలలోనూ అద్భుతమైనది.
నేరేడు పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు, బలమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి.
నేరేడు పండ్లలో ఉండే విటమిన్ సి శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది సీజనల్ వ్యాధులు, బాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు నుండి మనల్ని కాపాడుతుంది.
మధుమేహ బాధితులకు నేరేడు పండు ఒక గొప్ప వరప్రసాదం. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. నేరేడు గింజలలో ఉండే జాంబోలిన్ అనే గ్లూకోసైడ్, పిండి పదార్థాన్ని చక్కెరగా మారకుండా నిరోధిస్తుంది.
ఈ పండులో ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది, తద్వారా రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
నేరేడు పండ్లలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో, కాలేయం పనితీరును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును (Blood Pressure) నియంత్రణలో ఉంచుతుంది. ఇది ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తూ, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నేరేడు పండు కేవలం ఒక పండు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాల గని. ఈ సీజన్‌లో లభించే ఈ పండ్లను తృణీకరించకుండా తిని, వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మీ శరీరాన్ని సురక్షితంగా ఉంచుకోండి.