21 February 2025
Subhash
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇందులో గృహ, ఆటో, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ ఉన్నాయి.
పీఎన్‌బీ వడ్డీ రేట్లను సవరించింది. ఐదు సంవత్సరాల తర్వాత ఈ నెల ఫిబ్రవరి 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.50శాతం నుంచి 6.25శాతానికి తగ్గించింది.
మార్చి 31, 2025 వరకు వినియోగదారులు ముందస్తు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీల పూర్తి మినహాయింపును పొందవచ్చని బ్యాంక్ తెలిపింది.
సాంప్రదాయ గృహరుణ పథకంలో వడ్డీ రేటు సంవత్సరానికి 8.15 శాతం నుంచి ప్రారంభమవుతుందని.. నెలవారీ వాయిదా లక్షకు రూ.744గా ఉంటుందని పేర్కొంది.
ఆటో రుణాలకు సంబంధించి.. కొత్త, పాత కార్ల ఫైనాన్సింగ్ కోసం వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.50 శాతం నుంచి మొదలవుతాయని, లక్షకు రూ.1,240 వరకు ఈఎంఐ ఉంటుందని పేర్కొంది.
ఎడ్యుకేషన్ రుణాల విషయంలో కనీస కార్డ్ రేటును సంవత్సరానికి 7.85శాతం తగ్గించింది. వినియోగదారులు డిజిటల్ ప్రక్రియ ద్వారా రూ.20లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని పేర్కొంది.
సవరించిన రేట్లు 11.25శాతం నుంచి మొదలవుతాయని.. కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో ఎస్‌బీఐ ఆర్‌బీఐ పాలసీ రేటుకు అనుగుణంగా గృహ రుణాలతో సహా రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు కోత విధించిన విషయం తెలిసిందే.