9 July, 2025
Subhash
మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరోసారి చార్జీల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ (ఈటీ) టెలికం నివేదిక ప్రకారం..
దేశీయ టెలికం కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు ఈ ఏడాది ఆఖరుకల్లా ప్లాన్ల ధరల్ని 10 నుంచి 12 శాతం పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే కస్టమర్లపై చార్జీల భారం ఆయా ప్లాన్లు, వాటి కాలపరిమితి, రోజువారీ డాటానుబట్టి గరిష్ఠంగా రూ.500 వరకు పడటం ఖాయం.
ఏడాది క్రితం జూలైలోనే భారతీయ టెలికం సంస్థలు తమ మొబైల్ ఫోన్ ప్లాన్ల ధరల్ని 11 నుంచి 23 శాతం వరకు పెంచాయి. దీంతో వినియోగదారులకు భారంగా మారింది.
దీంతో ప్లాన్ వ్యవధి, దాని డాటా, ఇతరత్రా ఆఫర్లనుబట్టి గరిష్ఠంగా రూ.900 వరకు ధరలు పెరగడం గమనార్హం. పాపులర్ ప్లాన్ల ధరలు ఇప్పటికే రూ.200కుపైగా పెరిగాయి.
ఈ క్రమంలో మళ్లీ భారీ ఎత్తునే చార్జీల పెంపునకు వీలుందన్న వార్తలు.. కస్టమర్లకు గుబులు పుట్టిస్తున్నాయి. సహజంగా మార్కెట్‌లో 3 నెలల ప్లాన్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి.
డిసెంబర్‌కల్లా వాటి ధరలు ఇంకో రూ.70-85 మేర పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో టెలికం సంస్థల యాక్టివ్ సబ్‌స్ర్కైబర్లు భారీగా పెరిగారు.
రీఛార్జ్ ధరల్ని టెల్కోలు పెంచాలని భావిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్లాన్లపై ఆకర్షణీయ ఆఫర్లు వచ్చే వీలుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా.