అసలేంటీ 'కచ్చతీవు' దీవి వివాదం?  

April 04, 2024

TV9 Telugu

భారత్‌కు చెందిన 'కచ్చతీవు' ఐలాండ్‌ గత కొంతకాలంగా వార్తల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై శ్రీలంక- భారత్‌ ప్రభుత్వాలు ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాయి? ఆ వివరాలు మీకోసం

1974లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కార్  శ్రీలంకకు ఈ ఐలాండ్‌ను అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో వివాదం తెరపైకి వచ్చింది

తమిళనాడు రామేశ్వరానికి సమీపంలో భారత్‌- శ్రీలంకను వేరుచేస్తున్న పాక్‌ జలసంధిలో ఇది ఉంది.  ఇది చాలా చిన్నదీవి. ఈ జలసంధి రెండుదేశాలకు సరిహద్దుగా ఉంటోంది. అంతేకాకుండా పాక్‌ బే, బంగాళాఖాతంతో ఈ జలసంధి కలుపుతోంది

1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించారు. ఈ దీవిలో ఎవరూ ఉండరు. అయితే దీనిపరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది

దీంతో భారత మత్స్యకారులు ఈ దీవి వద్ద వేట ఎక్కువగా సాగిస్తుంటారు. అయితే శ్రీలంక ఈ దీవి తమది అన్న నెపంతో మత్స్యకారులపై దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తోంది

నాటి ఒప్పందంలో ఈ దీవిలో భారత్‌ మత్స్యకారులకు ప్రవేశం ఉంటుందని స్పష్టంగా చేస్తున్నా.. శ్రీలంక మాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ దీవి తమదని అక్కడ వేటకు వెళ్లడానికి అనుమతించమని చెబుతోంది

పైగా కచ్చతీవు దీవిలో సెయింట్‌ ఆంటోనీ అనే చర్చి కూడా ఉంది. ఏటా వేలాది మంది తమిళనాడు వాసులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. నిజానికి, భారత రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి

దీంతో న్యాయపరంగా చూస్తే ఈ అప్పగింత చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని తమిళ రాజకీయపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో కచ్చతీవు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది