Ravi Kiran
18 June 2024
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో విదేశాలకు వెళ్లాలని కోరిక ఉంటుంది. అయితే విదేశాలకు వెళ్లాలంటే భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ నేటి కాలంలో విదేశాలకు వెళ్లడం అంత కష్టమేమి కాదు.
భారతదేశానికి సమీపంలోని కొన్ని దేశాల్లో మీరు మినిమం 50 వేల రూపాయలు నుంచి రూ. లక్ష ఖర్చుతో సులభంగా తిరగవచ్చు. మరి అవేంటంటే..
భూటాన్: హిమాలయ కొండలతో కప్పబడిన భూటాన్ దక్షిణాసియాలో ఒక ముఖ్యమైన దేశం. ఈ దేశంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మీకు కావాలంటే ఏదైనా టూర్ ఏజెన్సీ నుంచి ముందస్తుగా భూటాన్ పర్యటనను బుక్ చేసుకోవచ్చు.
ఇక్కడికి వెళ్లేందుకు మీకు వీసా అవసరం లేదు. బాగ్డోగ్రా నుంచి రిటర్న్ ఫ్లైట్ వరకు పలు టూరిస్ట్ ఏజెన్సీలు తక్కువ ప్యాకేజీలతో ట్రిప్స్ అందిస్తున్నాయి. మీకు మినిమంలో మినిమం రూ. 50 వేలు ఖర్చు అవ్వొచ్చు. మ్యాగ్జిమం రూ. 80 వేల ఖర్చు అవ్వొచ్చు.
నేపాల్: నేపాల్ భారతదేశానికి పొరుగు దేశం. ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలు, మఠాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. మీరు చాలా తక్కువ బడ్జెట్‌లో నేపాల్ పర్యటనను పూర్తి చేయవచ్చు. బస్సు, రైలు, విమానంలో నేపాల్ చేరుకోవచ్చు. వీసా కూడా అవసరం లేదు
శ్రీలంక: శ్రీలంక వెళ్లడానికి మీకు ఎక్కువ సమయం పట్టదు. శ్రీలంక వెళ్లేందుకు చెన్నై, బెంగుళూరు నుంచి రూ. 16 వేల నుంచి ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. అంతేకాకుండా శ్రీలంకలో తక్కువ ధరకి హోటళ్లని బుక్ చేసుకోవచ్చు. ఈ దేశానికి వెళ్లాలంటే వీసా కావాలి.
థాయిలాండ్: థాయ్‌లాండ్‌ను హనీమూన్ స్పాట్‌గా పిలుస్తుంటారు. న్యూఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కి విమానంలో వెళ్లొచ్చు. నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఈ దేశానికి వెళ్లేందుకు కూడా వీసా అవసరం ఉంటుంది.
ఇక్కడికి వెళ్లాలంటే చెన్నై, ముంబై, బెంగళూరు నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. సుమారు రూ. 10 వేల నుంచి ఫ్లైట్ ఛార్జీలు మొదలవుతాయి.
ఇండోనేషియా: ఇండోనేషియా ఒక ప్రసిద్ధ ద్వీపం. మీరు కుటుంబంతో కలిసి ఇక్కడకు వెళ్లవచ్చు. మీరు ఇండోనేషియాలో 30 రోజుల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే వీసా అవసరం లేదు. ఇక్కడికి వెళ్లేందుకు చెన్నై, ముంబై, బెంగళూరు నుంచి.. విమాన టికెట్ ధర రూ. 20 వేల నుంచి మొదలవుతుంది.