ఏపీలో మరో వందే భారత్ ట్రైన్.. పూర్తి వివరాలు..

21 August 2023

రైల్వేశాఖ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో మధ్య వందేభారత్‌ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలు నగరాల మధ్య వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ తిరుగుతుంది.

ఇప్పుడు మరో వందేభారత్‌ ఏపీలో చెక్కర్లు కొట్టనుంది. విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.

ఈ మేరకు ఆదివారం సాయంత్రం 16 బోగీలతో కూడిన వందేభారత్‌ రైలు చెన్నై నుంచి విశాఖకు బయలుదేరిందని సమాచారం.

అయితే ఈ రైలు గురించి ఇప్పటివరకు తమకు ఎటువంటి సమాచారం అందలేదని అంటున్నారు వాల్తేరు రైల్వే అధికారులు.

విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు నడుస్తున్నప్పటికీ ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే  ఈ రైలును రద్దు చేయాల్సి వస్తోంది.

తరచూ ఇలా జరుగుతుండటంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రేక్‌ను చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

మరో పక్క దీన్ని విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.