యునెస్కో గుర్తింపు పొందిన 16వ శతాబ్దం నాటి మెట్ల బావి.. ఎక్కడో కాదు హైదరాబాద్ సమీపంలోనే.. 

25 August 2023

గోల్కొండ కోట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో 106 ఎకరాల్లో విస్తరించిన కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో 16 సమాధులు, 23 మసీదులు, ఆరు బావులు ఉన్నాయి.

వర్షపు నీటి నిల్వ, జల సంరక్షణ కోసం కుతుబ్ షాహీ కాలంలోనే ఆరు బావులను అద్భుతమైన రీతిలో నిర్మించారు.

ఇక్కడ ఉన్న ఈ పెద్ద మెట్ల బావి భారీ వర్షాలతో ఓ పక్క భాగం కూలిపోయి పూర్తిగా పూడుకుపోగా 2013లో ఆగాఖాన్‌ ట్రస్ట్‌ సహకారంతో దీన్ని పునరుద్ధరించారు.

ఈ బావి నుంచి మోట ద్వారా నీళ్లు పైకి తోడేందుకు ప్రత్యేక నిర్మాణం చేపట్టారు. రెండు వైపుల నుంచి బావిలోని నీటి వద్దకు చేరుకునేలా మెట్ల నిర్మాణం చేశారు.

ఆనాడు ఈ బడా బావి నుంచి నీళ్లను ఎలా తోడేవారు, వాటిని ఎలా వినియోగించేవారో చూస్తే అబ్బురమనిపిస్తుంది.

16వ శతాబ్దం నాటి ఈ బావి అడుగడుగునా కనిపించే నిర్మాణ శైలి సృజనాత్మకతకు అద్దం పడుతుంది. ఈ నిర్మాణం పర్షియన్ శైలిలో చేశారు.

మెట్ల బావి నుంచి ఏనుగులతో నీటిని తోడించేవారు. దీనికోసమే బావి లోపలకు వెళ్లేలా మెట్లను నిర్మించారు. ఈ బావిలో 37 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు.

మీరు హైదరాబాద్ సమీపంలో ఉన్న గోల్కొండ కోటకు వెళ్తే కచ్చితంగా ఈ మెట్ల బావి అద్భుత నిర్మాణాన్ని సందర్శించండి.