తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది.
కొన్ని టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అయితే ముందు నుంచి వెనుక వరుస సీట్ల వరకు పూర్తిగా మహిళలే కనిపిస్తున్నారు.
దీంతో సీటు దొరకలేదని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్లు కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకువచ్చారు.
మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.
గతంలోమహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా ఇప్పుడు 29 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి.
నిల్చొనేందుకూ స్థలం లేక బస్సు ఎక్కలేక విద్యార్థులు అక్కడే ఆగిపోయి ఇబ్బందిపడ్డ ఘటనలూ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఈ అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తోంది.
వృద్ధుల(పురుషులు)కు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతోంది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది.