బస్సుల్లో తిరిగి వస్తున్న ఐదు వేల సీట్లు!

TV9 Telugu

11 February  2024

హైదరాబాద్ సిటీ బస్సుల్లో గతంలో పోయిన సీట్లు తిరిగి వస్తున్నాయి. ఫలితంగా సీట్లు పెరగడంతో ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి.

సిటీ బస్సుల్లో ప్రయాణించే పురుషులు.. మహిళల సీట్లవైపు చొచ్చుకు రాకుండా గతంలో గ్రిల్స్ వంటివి ఏర్పాటు చేశారు.

ఇందుకోసం 1300 బస్సుల్లో ఒక్కో దాంట్లో నాలుగేసి సీట్ల చొప్పున తొలగించారు. ఈ లెక్కన దాదాపు 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోయాయి.

మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ఎన్నికల తర్వాత వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది.

దీంతో తొలగించిన ఈ సీట్లను తిరిగి అమర్చడం ద్వారా మరింత మంది సౌకర్యంగా ప్రయాణించే వీలు కల్పించాలని నిర్ణయించింది.

పాతబస్సులను తుక్కుగా మార్చుతున్న అధికారులు జిల్లాల్లో తిరిగే డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను నగరానికి తీసుకొచ్చి రూపురేఖలు మార్చుతున్నారు.

అడ్డుతెరలు లేకుండా ప్రతి బస్సులో 45 సీట్లు ఉండేలా చూస్తున్నారు. అలా ఇప్పటి వరకు 800 బస్సుల్లో 3,200 సీట్లు అధికంగా అందుబాటులోకి వచ్చాయి.

ఇక, ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య అమాంతం పెరిగింది. హైదరాబాద్‌లో ఒక రోజులో ప్రయాణించే మహిళల సంఖ్య 11 లక్షల నుంచి 19 లక్షలకు పెరిగింది.