అయోధ్య బాల రాముడు ధరించిన ఆభరణాల ప్రత్యేకతలు ఇవే..

TV9 Telugu

24 January 2024

అయోధ్యలో బాల రాముడు పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు ధరించి ముగ్ధమనోహర రూపంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.

బంగారు కిరీటంలో కులదైవం సూర్య దేవుని బొమ్మ ఉంది. దీనిని ఉత్తర భారత దేశ శైలిలో తయారు చేశారు. కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేలాడదీశారు.

హృదయభాగంలో మెరిసే కౌస్తుభ మణిని కెంపులు, వజ్రాలతో తయారుచేశారు. విష్ణుమూర్తి అవతారాలన్నిటిలోనూ ఇది కనిపిస్తుంది.

కెంపులు పొదిగిన పొడవైన విజయమాల హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం దీనిలో ఉన్నాయి.

నడుముకు అమర్చిన ఆభరణంలో వజ్రాలు, మరకత, మాణిక్యాలు, కెంపులను పొదిగారు. పాదిక అనే హారాన్ని నాభి వద్ద అలంకరించారు.

అయోధ్య బాల రాముని కాళ్లకు కడియాలు, కాలి వేళ్లకు చుట్లు పెట్టారు. వీటన్నిటిలోనూ వజ్రాలు, కెంపులను పొదిగారు.

ముత్యాలు, పచ్చ రాళ్లు పొదిగిన బంగారు విల్లు, బాణం బాలరాముడు చేత ధరించాడు. వజ్రాలు, కెంపులతో వెండి-ఎరుపు రంగుల్లో నుదుటిపై తిలకాన్ని పెట్టారు.

వాల్మీకి రామాయణం, రామచరితమానస్‌ వంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసి ఆభరణాలను తయారు చేయించినట్లు ట్రస్ట్‌ తెలిపింది.