భక్తిపారవశ్యంతో పులకించిన త్రివేణి సంగమం

TV9 Telugu

14 January 2025

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. సాధువుల శంఖనాదాలు, భజనలతో ప్రయాగ్‌ రాజ్‌ పులకించిపోతోంది.

హర్‌ హర్‌ మహాదేవ్‌, జై శ్రీరాం, జై గంగామయ్యా నామస్మరణతో ప్రయాగ్ రాజ్‌ మార్మోగుతుంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ స్థలం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది.

రెండోవ రోజు మంగళవారం(జనవరి 14) తెల్లవారుజామున లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తారు. తీవ్రమైన చలి ఉన్నా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

మకర సంక్రమణం సందర్భంగా షాపీ స్నాన్‌కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 2 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్టు సమాచారం.

తొలిరోజు సోమవారం ఒక్కరోజే కోటి 65 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

మకర సంక్రాంతి రోజున కోటిమందికి పైగా భక్తులు మహాకుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉంది. మరో 43 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా.

సాధువులతో కుంభమేళా ప్రాంగణం నిండిపోయింది. సాధువుల ఆశీర్వాదంతో కోసం భక్తులు వారిదగ్గరికి వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

కుంభమేళాకు విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నదీస్నానం ఆచరించి సాధువుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు

భక్తుల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 వందల 96 ఛార్జీతో మహాకుంభ మేళా, ప్రయాగ్‌రాజ్‌ నగరాలను గగనతలం నుంచి వీక్షించే అవకాశం కల్పించింది.