TV9 Telugu

తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం

14 Febraury 2024

తిరుమల శ్రీవారికి ఒకే రోజు రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చింది. సోమవారం (ఫిబ్రవరి 12) ఒక్కరోజే 69 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకున్న భక్తులు.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హుండీలో రూ.5.48 కోట్లు కానుకలు సమర్పించుకున్నారు.

ఇటీవల కాలంలో ఒకే రోజు స్వామివారికి రూ.5 కోట్లకు పైగా హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారి. సోమవారం రికార్డు స్థాయిలో రూ.5.48 కోట్ల ఆదాయం రావడం విశేషం.

గత శుక్రవారం (ఫిబ్రవరి 9)నాడు 62 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ కానుకల రూపంలో టీటీడీకి రూ.4.31 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.

కరోనా సమయంలో భక్తుల దర్శనాల సంఖ్య తగ్గిపోవడంతో ఆ మేరకు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా తగ్గుముఖంపట్టింది.

అయితే ఇప్పుడు రోజువారీ హుండీ ఆదాయం కరోనా మునుపటి నాటి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఒక రోజులో రూ.5 కోట్లకు పైగా హుండీ ఆదాయం రావడం విశేషం.

తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సీజన్‌లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ఆ మేరకు హుండీ ఆదాయం కూడా పెరిగే అవకాశముంది.

ప్రతినెలా తిరుమల శ్రీవారికి రూ.100 కోట్లకు పైగా హుండీ ఆదాయం సమకూరుతోంది. 2023లో టీటీడీకు హుండీ ఆదాయం ద్వారా రూ.1,398 కోట్ల ఆదాయం సమకూరింది.