నవరాత్రి రెండో రోజు లంబోదరుడిని ఏ పేరుతో పిలుస్తారంటే.?
07 September 2024
Battula Prudvi
లంబోదరుడి నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారు తీరొక్క రూపంలో అందంగా అలంకరించిన మండపాల్లో ఆసీనులయ్యారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడిని "వరసిద్ధి వినాయకుడు"గా పూజిస్తారు.
చవితి రోజున గణపతికి ఉండ్రాళ్లు ప్రసాదంగా సమర్పిస్తారు. మరి రెండో రోజు గణేశుడ్ని ఏ పేరుతో పిలుస్తారు.. ఈ నైవేద్యంగా సమర్పిస్తారో తెలుసుకుందాం..
భాధ్రపద శుద్ధ పంచమి నాడు అంటే రెండో రోజు గణపతి 'వికట వినాయకుడు'గా పూజలు అందుకుంటాడు. ‘లంబోదరశ్చ వికటో’ అని స్మరిస్తాం.
రెండో రోజు స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి, మొదటిరోజున పూజించినట్లే పూజించాలి. అటుకుల నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండో రోజు స్వామివారికి పెట్టడానికి అటుకుల పాయసం చేసుకోవచ్చు. ఇది ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం రండి..
దీని కోసం కావలసిన పదార్థాలు అటుకులు, చిక్కటి పాలు, బాదం, పిస్తా, నెయ్యి, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష.
ముందుగా అటుకుల్ని కడిగి పది నిమిషాలు ఓ ప్లేటులో ఆరబెట్టాలి. తర్వాత స్టౌపై బాండీ పెట్టి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మందపాటి గిన్నెలో పాలు పోసి మరిగించి సగం అయిన తరవాత అటుకులు వేసి కలుపుతూ మరికాసేపు మరిగించాలి.
ఐదు నిమిషాలకి స్టౌ సిమ్‌లో పెట్టి పంచదార, యాలకులపొడి వేసి కలుపుతూ చివరగా తరిగిన బాదం, పిస్తా, వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలిపి దించాలి.