లోక్‌సభలో ఆగంతుకుల కలకలం.. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున.!
13 December 2023
లోక్‌సభలో ఆగంతుకుల కలకలం..విజిటర్స్ పేరుతో సభలోకొచ్చిన దుండగులు. సభలో టియర్ గ్యాస్ ప్రయోగం.. భయంతో పరుగులు పెట్టిన ఎంపీలు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై దాడి.
2001 డిసెంబర్ 13.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయం. ఆ రోజు ముఖ్యమైన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.
అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు తీవ్రరూపం దాల్చడంతో సభ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా పడి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి, ప్రతిపక్ష నాయకురాలు సోనియాగాంధీ పార్లమెంటు నుంచి వెళ్లిపోయారు.
అదే సమయంలో ఉగ్ర మూకలు కాల్పులకు తెగబడటంతో పార్లమెంటు ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పులు, ఆర్తనాదాలు, పరుగులతో గందరగోళంగా మారింది.
కాల్పుల శబ్దం విన్న వెంటనే అదే ప్రాంగణంలో ఉన్న సీఆర్పీఎఫ్ బెటాలియన్ తక్షణమే రంగంలోకి దిగింది. ఉగ్రవాదులపై ఎదురుదాడికి దిగింది బెటాలియన్.
వారు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఒక్క ఉగ్రవాది ఐదో గేట్ వైపు పరుగులు తీయగా అతడిని కూడా బలగాలు మట్టు బెట్టాయి.
ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ కు చెందిన ఒక మహిళా గార్డు, ఇద్దరు రాజ్యసభ ఉద్యోగులు, ఒక తోటమాలి మృతి చెందారు.
దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో అంతమొందించగా.. బయట ఉన్న సూత్రధారులను రెండు రోజుల్లోనే పట్టుకున్నారు.
అఫ్జల్ గురు, ఎస్ ఏ ఆర్ గిలానీ, అఫ్షాన్ గురు, షౌకత్ హుస్సేన్ లను ఈ ఘాతుకానికి బాధ్యులుగా తేల్చి అరెస్టు చేశారు.
విచారణ అనంతరం స్థానిక కోర్టు వారికి మరణ శిక్ష విధించింది. నిందితులు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోగా అఫ్జల్ గురు మరణ శిక్షను సమర్థించిన కోర్టు.. సౌకత్ హుసేన్ మరణ శిక్షను పదేళ్ల జైలు శిక్షకు తగ్గించింది.
గిలానీ, అఫ్షాన్ లను నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత 2013 డిసెంబర్ తొమ్మిదో తేదీ ఉదయం 9 గంటలకు అఫ్జల్ గురును ఢిల్లీ తీహార్ జైలులో ఉరి తీశారు.