TV9 Telugu

గృహిణి సేవలను ఆర్థిక కోణంలో చూడొద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

21 Febraury 2024

ఇంటి పని, వంట పని చేస్తూ సమయానికి కుటుంబానికి ఏం కావాలో అది అందిస్తూ చక్కగా ఇంటిని నిర్వహించే భార్య సేవలు వెలకట్టలేనివని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని తెలిపింది. ఓ యాక్సిడెంట్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

2006లో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వాహనానికి బీమా సౌకర్యం లేకపోవడంతో వాహన యజమాని ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ రూ.2.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని పెంచాలని బాధిత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది.

ఆ పిటిషన్‌ను హైకోర్టు 2017లో కొట్టివేసింది. మహిళ గృహిణి కాబట్టి ఆమె ఆదాయం పరిమితమని, కాబట్టి ఆమెకు ఇవ్వాల్సిన పరిహారం ఫిక్స్‌డ్‌గా ఉంటుందని తేల్చి చెప్పింది.

హైకోర్టును తీర్పును బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది.

గృహిణి ఆదాయాన్ని దినసరి కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని హైకోర్టుని ప్రశ్నించింది సుప్రీమ్ కోర్ట్.

బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆరు వారాల్లోపు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది సుప్రీమ్.