14 August 2023
కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కీలక అధికారులు, వీవీఐపీలు, వీఐపీల కార్లకు ప్రోటోకాల్‌లో భాగంగా సైరన్ ఉంటుంది. రోడ్లపై వారి వాహనాలు వెళ్తుంటే సైరన్ మోత మోగుతుంది.
దీంతో వీఐపీలు వెళ్లే రూట్లలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. అయితే, ఈ సైరన్‌ను కొందరు దుర్వినియోగం చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖులు వాహనాల్లో లేకపోయినా చాలా మంది ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకునేందుకు, తొందరగా గమ్యం చేరేందుకు అనుమతి లేకున్నా సైరన్ ఉపయోగిస్తున్నారు.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, వాహనాల సైరన్ మోతను వినసొంపుగా మార్చేందుకు కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
శబ్ద కాలుష్యాన్ని అదుపులో ఉంచడం ఎంతో ముఖ్యమని.. వీఐపీ వాహనాలపై ఉండే రెడ్ లైట్ (సైరన్) సంస్కృతికి ముగింపు పలికే అవకాశం తనకు లభించిందని.. రెడ్ లైట్, సైరన్ తొలగించాలనుకుంటున్నామని తెలిపారు.
సైరన్‌కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, శంఖం వంటి వాటితో రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేసేందుకు నిబంధనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశమని.. త్వరలోనే కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తామంటూ నితిన్ గడ్కరీ వివరించారు.