నెహ్రూ తర్వాత ఆ అరుదైన ఘనత సాధించిన ప్రధాని మోదీ..

10 June 2024

Shaik Madar Saheb

భారత్‌లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 3వ సారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేసి.. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు. 

హ్యాట్రిక్ విజయాలతో NDA కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ.. ముచ్చటగా 3వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

1947-1964 వరకు జవహర్‌లాల్ నెహ్రూ భారత ప్రధానిగా కొనసాగారు.. ఆయన మరణించే వరకు మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు అధికారంలో కొనసాగారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ మూడు పర్యాయాలు పూర్తి స్థాయిలో ప్రధానిగా కొనసాగారు.. 

వరుసగా మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసి నరేంద్ర మోదీ ఆ రికార్డును తిరగరాశారు.. నెహ్రూ తర్వాత ఎవ్వరూ కూడా ప్రధానిగా మూడు సార్లు ప్రమాణం చేయలేదు..

రాష్ట్రపతిభవన్‌లో తరలి వచ్చిన దేశ, విదేశీ అతిథులు, సెలబ్రిటీలు, వేలాది మంది ప్రజల సమక్షంలో కన్నులపండువగా మోదీ 3.0 ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. 

మొదట ప్రధానితో ప్రమాణం చేయించిన తర్వాత.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. 

మొత్తం 72 మందితో కేంద్ర మంత్రివర్గం ఏర్పాటైంది.. వీరిలో 30 మంది కేబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీకి ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.