భారత దేశీయ దత్తత కోరుకునే దంపతులు, వ్యక్తులు ‘కేరింగ్స్’ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవసరమైన పత్రాలన్నీ 30 రోజుల్లోగా అప్‌లోడ్ చేయాలి.
పోర్టల్‌లో దంపతులు, వ్యక్తులు తమ పేర్లు, పుట్టినతేదీ, కుటుంబ ఫొటో, జాతీయత, చిరునామా, ఉద్యోగ, వ్యాపార వివరాలు, వార్షికాదాయం, పాన్, ఆధార్, పాస్‌పోర్టు నంబర్ల వివరాలు నమోదు చేయాలి.
కావాల్సింది అబ్బాయా... అమ్మాయా, ఏ వయసున్న పిల్లలు అవసరమో వెల్లడించాలి. దత్తత ఎందుకు తీసుకుంటున్నారో వివరించాల్సి ఉంటుంది.
వివాహ ధ్రువీకరణ, విడాకులు తీసుకుంటే డైవోర్స్ డిక్రీ, సింగిల్ పేరెంట్ అయితే బంధువుతో అండర్‌టేకింగ్, అప్పటికే కుటుంబంలో పిల్లలుంటే వారి సమ్మతిపత్రం సమర్పించాలి.
దరఖాస్తును పరిశీలించాలక జిల్లా చిన్నారుల సంరక్షణ కమిటీ(డీసీపీయూ) లేదంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్‌ఏఏ) అధికారులు 60 రోజుల్లోగా పోర్టల్‌లో నమోదు చేస్తారు.
అన్నీ సరిగా ఉంటే... సీనియారిటీ ప్రకారం నిర్ణీత కాలవ్యవధి అనంతరం దత్తతకు సిద్ధంగా ఉన్న చిన్నారుల వివరాలు దంపతులకు ఆన్‌లైన్‌లో వస్తాయి.
నెల రోజుల వ్యవధిలో కొంత కాలపరిమితి ఇస్తూ ముగ్గురు చిన్నారులను రిఫర్ చేస్తారు. అప్పుడు దంపతులు చిన్నారిని రిజర్వు చేసుకోవాలి.
దంపతులకు మరోసారి కౌన్సెలింగ్ చేసి, మినిట్స్ రూపొందిస్తారు. అనంతరం చిన్నారిని దంపతులకు ప్రీ అడాప్షన్ కింద ఫిజికల్ కస్టడీకి ఇస్తారు. జిల్లా కలెక్టరు 60 రోజుల్లోగా దత్తత ఆదేశాలు జారీ చేస్తారు.