మెల్లకన్ను.. ఉంటే ‘అదృష్టవంతులు’ అనే మాట మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు.. ఇది నిజంగా అదృష్ట సూచికా.. లేదా ఏదైనా అనారోగ్యానికి సంకేతమా?
ఈ విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి పరిశీలిద్దాం.. అదృష్టం అనే మాట సంగతి అటుంచితే, ఇది ఉన్న వారికి భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు
బాల్యంలో మెల్లకన్ను ఉన్నవారికి వారు పెరిగి పెద్దయ్యాక హైపర్‌టెన్షన్, మెటబాలిక్ సిండ్రోమ్, ఊబకాయం, హృద్రోగాల బారిన పడే అవకాశం ఉందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ చేసిన పరిశోధనల్లో వెల్లడైంది
వీరి పరిశోధనల్లో భాగంగా 40నుంచి 69 ఏళ్ల వయసున్న లక్షమందిని పరీక్షించగా.. వారిలో 3 వేల మందికి పైగా బాల్యంలో మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించారు
ఇక మెల్లకన్ను ఉన్న వారిలో 82 శాతం మందికి వయసు పెరిగే కొద్దీ కంటిచూపు మందగించినట్లు గుర్తించారు. ఈ సమస్య ఉన్న వాళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం 29శాతం అధికమట
నిజానికి ఒక కంట్లో చూపు సరిగా వృద్ధి చెందకపోవడం వల్ల మెల్లకన్ను సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీన్నే ‘లేజీ ఐ’, ‘ఆంబ్లియోపియా’ అని పిలుస్తారు
ఇలాంటి వారి కన్ను బలహీనంగా ఉండటం వల్ల అది చూసే వస్తువులను మెదడు గుర్తించకపోవడంతో వాళ్లు దేన్నైనా చూసేటప్పుడు కంటి గుడ్డు దానిస్థానంలో కాకుండా, పక్కకు వెళ్తుంటుంది
ప్రతి వందమంది పిల్లల్లో నలుగురికి ఈ సమస్య ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు నాలుగైదేళ్లప్పుడే మెల్లకన్ను ఉందేమో పరిశీలించి వెంటనే చికిత్స అందించాలి