కొండ దిగిన కోడి కూర.. మస్త్ ఎంజాయ్ చేస్తున్న నాన్‌వెజ్ లవర్స్
10 December 2023
ఒక వైపు అన్ని నిత్యావసర వస్తువులు, కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చుంటే.. కోడి కూర మాత్రం కొండ దిగొచ్చింది.
ఒకప్పుడు రూ.250 నుంచి 300 వరకూ పలికిన కిలో చికెన్ ఇప్పుడు మాత్రం కేవలం రూ.120 నుంచి 140 మాత్రమే ఉంది.
చికెన్ ధరలు భారీగా తగ్గడంతో మాంసాహార ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. కేజీకి బదులు రెండు కేజీలు కొని ఎంజాయ్ చేస్తున్నారు.
కార్తీక మాసం ఎఫెక్ట్‌తో చాలా మంది నాన్‌వెజ్‌కి దూరంగా ఉంటున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. డిమాండ్ తగ్గడంతో రేట్లు ఒక్కసారిగా దిగొచ్చాయి.
ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియులతో పాటు కార్తీకమాసం సెంటిమెంట్లు లేని వాళ్లు మాత్రం ఇదే అదను అనుకుని.. రకరకాల వంటకాలు వండుకుని చికెన్ ఫెస్టివల్ కానిచ్చేస్తున్నారు.
అయితే పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేట్లు భారీగా పడిపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటున్నారు.
మరో 10-15 రోజుల వరకూ చికెన్ రేట్లు ఇలాగే ఉండే అవకాశం ఉంది. అప్పటి వరకు తమకు నష్టాలు తప్పవంటున్నారు పౌల్ట్రీ రైతులు.
అయితే మాంసం ప్రియులు మాత్రం తమ ఇళ్లలో రుచికరంగా చికెన్ ఫుడ్ ఫెస్టివల్‌ను కొనసాగించేందుకు ఫిక్స్ అయిపోయారు.