మత్తెక్కించే పరిమళాలు వెదజల్లే నైట్‌క్వీన్.. ఇంటి బాల్కనీలో ఎలా పెంచాలంటే!
April 25, 2024
TV9 Telugu
మత్తెక్కించే పరిమళాలు వెదజల్లే నైట్‌క్వీన్ చుట్టూ ఉండే ప్రదేశాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. ఈ మొక్క బాల్కనీలో పెంచుకోవాలనుకుంటే కొన్ని మెలకువలు తెలుసుండాలి. లేదంటే మొక్కనాటిన కొన్ని రోజులకే వాడిపోతుంది
నైట్‌క్వీన్ మొక్కలను.. క్వీన్ ఆఫ్ నైట్, నైట్ క్వీన్, రాత్‌కీ రాణీ... ఇలా ప్రాంతానికో పేరుతో పిలుస్తుంటారు. ఈ పూల మొక్క శాస్త్రీయ నామం సెస్ట్రమ్ నాక్టర్నమ్. సోలనేసి కుటుంబానికి చెందిన పొదలా పెరిగే మొక్క ఇది
ఈ మొక్క పూలు రాత్రి పూట మాత్రమే వికసిస్తాయి. ఆకుల కొనలు సూది మొనలా పచ్చగా నిగనిగలాడతాయి. కిందకి వాలినట్లు ఉండే వీటి పూలు కాండం పక్కనున్న ఆకుల నుంచి వస్తాయి
నైట్‌క్వీన్ మొక్క పూలు ఆకుపచ్చ, తెలుపు కలగలిపిన రంగులో, గొట్టం ఆకృతిలో విరబూస్తాయి. ఈ పూలు తెలుపు రంగులో మత్రమే కాకుండా ఊదా, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి
ఈ మొక్క పదమూడు అడుగుల ఎత్తు వరకూ అల్లుకుంటూ పెరుగుతుంది. ఇంటి బాల్కనీల్లో కుండీల్లో పెంచుకునేటప్పుడు మాత్రం కత్తిరించి దీని పొడవును నియంత్రించవచ్చు. అప్పుడు చూడ్డానికి గుబురు పొదలా అందంగా కనిపిస్తుంది
ఈ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి మాత్రం ఎండ తగినంత ఉండాలి. కనీసం ఆరుగంటలైనా ప్రత్యక్ష సూర్య కాంతి అవసరం. సారవంతమైన ఇసుక నేలల్లో ఇది బాగా ఎదుగుతుంది. దీన్ని సువాసనకోసమే ఎక్కువగా పెంచుతారు
ఈ మొక్కకు నిరంతరం తేమ ఉండేలా చూసుకోవాలి. కుండీల్లో పెంచినప్పుడు వేర్లు దెబ్బతినకుండా రెండేళ్లకోసారి రీపాటింగ్ చేస్తుండాలి. కంపోస్ట్ రెండు నెలలకోసారైనా అందిస్తే మొక్క పచ్చగా నిగనిగలాడుతూ పూలూ బాగా వస్తాయి
గొంగళి, తెల్ల దోమ వంటివాటి బెడద వీటికెక్కువ. ఇలాంటప్పుడు సబ్బు నీళ్లు, వేపనూనె ద్రావణం స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా పెంచేస్తే మీ ఇంటి పరిసరాల్ని సుగంధ భరితం చేసేయందీ నైట్‌క్వీన్ మొక్క