కళ్లు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి

31 December 2024

Ravi Kiran

ప్రస్తుతం చిన్నత‌నం నుంచే క‌ళ్లద్దాల‌ను వాడాల్సిన దుస్థితి నెల‌కొంది. దీనికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. మారిన జీవ‌న‌శైలి ప్రధాన కార‌ణంగా చెప్పవ‌చ్చు. 

ముఖ్యంగా కంప్యూట‌ర్లు, ఫోన్లు, టీవీ తెర‌ల‌ను అధికంగా చూడ‌డం, పోష‌కాహార లోపం వ‌ల్లే చాలా మంది కంటి చూపు స‌మ‌స్యను ఎదుర్కొంటున్నారు. 

ఇక 40 ఏళ్ల వ‌య‌స్సు దాటితే చాలా మందికి క‌ళ్లలో శుక్లాలు వ‌స్తున్నాయ‌ని కంటి వైద్యులు చెబుతున్నారు. రోజువారి దిన‌చ‌ర్యలో భాగంగా కొన్ని జాగ్రత్తల‌ను పాటిస్తే క‌ళ్లను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. 

బ‌య‌ట ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగేవారు క‌ళ్లకు ర‌క్షణ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు గాను కూలింగ్ గ్లాసెస్‌ను ఉప‌యోగించాలి. దానితో కంటి చూపు దెబ్బతిన‌కుండా ఉంటుంది. 

దీనికి తోడు ప్రతి ఏడాది క‌చ్చితంగా కంటి వైద్యుల‌ను క‌లిసి ప‌రీక్షలు చేయించుకోవాలి. సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డే కొద్దీ క‌ళ్లలో శుక్లాలు వంటివి వ‌స్తుంటాయి. 

కంటి చూపు కూడా మంద‌గిస్తుంది. అలాగే గ్లకోమా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఏడాదికి ఒక‌సారి అయినా స‌రే ఈ టెస్టుల‌ను చేయించుకోవాలి. ఏదైనా స‌మ‌స్య ఉన్నట్లు తేలితే వెంట‌నే చికిత్స తీసుకోవాలి. 

రాత్రిపూట నిద్రకు ముందు చాలా మంది ఫోన్ల‌ను ఎక్కువ‌గా చూస్తుంటారు. చీక‌ట్లో ఫోన్ చూడ‌డం వ‌ల్ల ఫోన్ వెలుతురు క‌ళ్ల‌పై ప‌డి క‌ళ్లు ఒత్తిడికి గుర‌వుతాయి. 

దీంతో క‌ళ్లలోని ద్రవం ఆవిరై పోతుంది. క‌ళ్లు పొడిబారి దుర‌ద పెడ‌తాయి. క‌నుక క‌ళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి పూట ఫోన్లను త‌క్కువ‌గా వాడాలి. లేదా పూర్తిగా మానేయాలి.