రాత్రి పడుకునే ముందు మద్యం సేవిస్తే హాయిగా నిద్రపడుతుందా?

Ravi Kiran

14 July 2024

ఆరోగ్యకరమైన జీవనానికి సరిపడా నిద్ర కూడా అవసరం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో రకరకాల వ్యాధులు తలెత్తుతాయి. 

గజిబిజి జీవనశైలి కారణంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. 

అయితే చాలామంది ఆల్కహాల్ తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందనే భ్రమలో పడి ఎక్కువ రాత్రుళ్లు తాగేస్తున్నారు.

నిజంగా.. ఆల్కహాల్ సేవిస్తే హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుందా? అనే విషయాన్ని నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

ఢిల్లీలో ఓ ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ గౌరవ్ జైన్.. మద్యం సేవించిన తర్వాత తేలికగా నిద్రపడుతుందని అందరూ భావిస్తారు. కానీ అది అస్సలు నిజం కాదు.

దీర్ఘకాలిక మద్యపానం నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పడుకునే ముందు ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా నిద్రకు భంగం కలిగించవచ్చు. రాత్రి తర్వాత మరుసటి రోజంతా అలసటగా అనిపిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఎంత ఆల్కహాల్ తాగుతారు.. ఎప్పుడు తాగుతారు.. ఏ సమయంలో తాగుతారు అనేవి మీ నిద్రను ప్రభావితం చేస్తాయి.

మద్యం తాగినప్పుడు, అది త్వరగా మీ రక్తప్రవాహంలోకి శోషించబడుతుంది. కాలేయం దానిని పూర్తిగా జీవక్రియ చేయగలిగేంత వరకూ అది రక్తంలో ఉంటుంది. ఫలితంగా రాత్రిపూట గాఢ నిద్ర రావచ్చు. 

ఆల్కహాల్ సరిగ్గా జీవక్రియ చేయకపోతే, పదేపదే మెలుకువ వస్తుంది. అందుకే నిద్రకు ముందు మద్యం సేవించకూడదని వైద్యులు సూచిస్తున్నారు.