చద్దన్నం..పరమౌషధం..! ఇది తెలిస్తే మీరు రోజూ తింటారు..
Jyothi Gadda
01 July 2024
రాత్రి మిగిలిన అన్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున తినడం మాత్రమే కాదు,కొందరు రాత్రికి మిగలేలా అన్నం వండుకుని మరీ ఉదయాన్నే చద్దన్నం తింటారు. చద్దన్నంలో అంత గొప్ప తనం ఏముందో తెలిస్తే వదిలిపెట్టారు.
చాలామందికి చద్దన్నం అంటే ఇష్టముండదు. కొందరైతే చద్దన్నం అనే మాట వింటేనే వాక్ అంటారు. కానీ ఒక్కసారి చద్దన్నంవల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారంటే ఇకపై చద్దన్నం వద్దు అనే మాట మీ నోట రానే రాదు.
అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం.. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్, కాల్షియం లాంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది.అందుకే చద్దన్నంలో ఆ పోషకాల పాళ్లు ఎక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి అది 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి.
చద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్‌గా ఉంటుంది. అంతేకాదు చద్దన్నంతో శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభిస్తుంది. ఒంట్లో వేడి చేయడం కారణంగా మన బాడీలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది.
తరచూ చద్దన్నం తినడంవల్ల ఫైబర్ కంటెంట్ పెరిగి మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా బీపీ అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
అంతేకాదు, ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు కూడా చద్దన్నం మంచి పౌష్టికాహారం.
ఈ చద్దన్నం సన్నగా ఉన్నవాళ్లు లావయ్యేందుకు, లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు కూడా తోడ్పడుతుంది. లావు తగ్గాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని రాత్రే చల్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి. క్రమంగా లావు తగ్గుతారు.