ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ పండు కూడా ఒకటి. ఈ పండును తరచూ మన డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ నుంచి వ్యాధినిరోధకత వరకు ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచుతుంది. వంద గ్రాముల కివీ పండు తింటే ఒక రోజులో దేహానికి అవసరమైన సి విటమిన్‌లో అధిక శాతం లభిస్తుంది.
కివీ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి చర్మం పాలిపోకుండా, ముడుతలు పడకుండా కాపాడుతుంది. కివీ ముక్కలు తినడం ద్వారా గానీ, లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం ద్వారా గానీ ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రస్తుతం ఈ భూమ్మీద లక్షలాది మంది ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వారికి కివీ ఫ్రూట్ ఒక వరం లాంటిది. ఎందుకంటే కివీ పండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కివీ పండు జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి 100 గ్రాముల కివీ పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రతిరోజూ మానవ శరీరానికి అవసరమైన ఫైబర్‌లో 12 శాతం అందుతుందని నిపుణులు చెబుతున్నారు.
కివీ పండులోని ఫైబర్‌లు సునాయాసమైన, ఆరోగ్యకరమైన జీర్ణశక్తికి దోహదం చేస్తాయి. కివీ పండులో ఎంజైమ్‌లను కరిగించే ప్రొటీన్ ఉంటుంది. దాంతో ఎంజైమ్‌లు అత్యంత వేగంగా అమైనో ఆసిడ్స్‌గా మారుతాయి.
కివీ పండులో సెరటోనిన్ వంటి నిద్రకు ఉపకరించే పదార్థాలు ఉన్నాయి. అందువల్ల తరచూ కివీ పండు తినేవారికి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు మంచి మేలు చేస్తుంది.