పాము కాటేసే ముందు హెచ్చరిస్తుందా... ఒక్క కట్ల పాము మినహా మిగిలిన అన్ని పాములు ముందుగానే వివిధ శబ్ధాలతో మన్నల్ని హెచ్చరిస్తాయి.
నిజానికి పాములు నేరుగా కాటేయవని.... ముందుగా సిగ్నల్ ఇస్తాయని నిపుణుల అంటున్నారు. దాన్ని నిశితంగా గమనిస్తే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు.
సాధారణంగా మనం పాములను చూసి భయపడతాం గానీ, వాటికి మనం అంటేనే భయం. అందువల్లే అవి ప్రాణ భయంతో కాటేసే యత్నం లేదా సంకేతం ఇస్తాయి.
దేశంలోని ప్రధాన నాలుగు విషపూరిత పాముల్లో కట్లపాము కూడా ఉంది. ఒక్క కట్లపాము తప్ప మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయి. కట్లపాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం.
రాత్రి వేళల్లో కట్లపాము చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి.
మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని చెబుతున్నారు.
ఒక వ్యక్తిని పాము కాటు వేస్తే... ఆ వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది.
పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకూడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి.