దీపావళికి నూనెతోనే కాదు.. ఇలా కూడా దీపాలను వెలిగించవచ్చు..

13 November 2023

దీపావళి నాడు వెలిగించే దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఏటా ఎన్నో దీపాలు సరికొత్తగా ముస్తాబై మరీ మార్కెట్లో కొలువుదీరుతున్నాయి.

ఈ పండుగకు కొన్నయినా మట్టి దీపాలు పెట్టడం సంప్రదాయం. మట్టి దియాల్లో నూనె పోసి, వెలిగించేవి కొన్నయితే, ఆ శ్రమ లేకుండా మైనాన్నే నింపుకుని వస్తున్నవి మరికొన్ని.

మైనం వాసన కొందరికి పడదు. అలాగని నూనె పోసి వెలిగించే తీరికా ఉండదు. అలాంటి వాళ్లను సోయా వ్యాక్స్‌ నింపి వాటిని పూలతో అలంకరించిన దీపాలు ఆకట్టుకుంటున్నాయి.

ఇవి నెమ్మదిగా కాలతాయి కాబట్టి చాలాసేపు వెలుగుతుంటాయి. మైనం కరుగుతున్నా వాటిమీద ఉన్న డిజైన్‌ అలాగే ఉంటుంది కాబట్టి చూడ్డానికీ అందంగా ఉంటాయి.

లావెండర్‌, గులాబీ, లిల్లీ పరిమళ తైలాలతో నిండిన సెంటెడ్‌ క్యాండిల్స్‌ దీపాల వరసలో బారులు తీరుతున్నాయి.

ఏలాంటి వాసనా లేని పారఫిన్‌ తైలంలో రెజిన్‌ పదార్థాన్ని కలిపి పారదర్శకంగా చేసిన జెల్‌ క్యాండిల్సూ మెరుస్తున్నాయి.

మోతీచూర్‌ లడ్డూలా జాంగ్రీలా కాజు కట్లీలా మొక్కజొన్న కంకిలా ద్రాక్షగుత్తిలా మైనపు దీపాల్ని తయారుచేసి ఔరా అనిపిస్తున్నారు కళాకారులు.

ఆ నింగిలోని చుక్కలూ జాబిల్లీ నేలమీదకి రావడంతో ఆకాశంలో అమావాస్య ఏర్పడి, పుడమికి పున్నమి అద్దినట్లుగా ఉంటుంది దీపావళి దీప శోభ..!