ప్రకృతి సహజ సిద్ధ అందాలకు కేరాఫ్ అల్లూరి ఏజెన్సీ. ఎత్తైన కొండలు, లోయలతో పాటు జలపాతాలు ఈ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చాయి.
ముఖ్యంగా పాడేరు ఏజెన్సీలో.. జలపాతాల సోయగాలు అన్నీ ఇన్నీ కావు. ఏజెన్సీలో ఎన్ని జలపాతాలున్నా.... ఆ జలపాతం ప్రత్యేకతే వేరు. అదే ఐస్ గడ్డ జలపాతం.
ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సీలేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఐస్ జలపాతం.
ఈ జలపాతంలో నీరు ఏడాది పొడవునా ఉంటుంది. వేసవికాలంలో చాలా జలపాతాల్లో నీరు ఎండిపోతున్నా.. ఇక్కడ మాత్రం జలజలా జారుతూనే ఉంటుంది.
జలపాతంలోకి దిగితే.. గడ్డ కట్టేంత చల్లగా ఉంటుంది . అందుకే దానికి ఐస్ గడ్డ జలపాతం అని పేరు వచ్చింది. ఒకసారి దిగితే అక్కడ నుంచి మళ్లీ తిరిగి రావాలనిపించదు.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉన్న.. ఈ జలపాతం విశాఖ నుంచి చింతపల్లి, జీకే వీధి మీదుగా భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిలో ఉంది.
సాధారణ సమయంలో ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉంటారు. కానీ కార్తీక మాసంలో ఈ జలపాతం వద్ద వీరి సందడి విపరీతంగా పెరిగిపోతుంది.
ఏఓబీలో ఉండడంతో రెండు రాష్ట్రాల నుంచే కాకుండా.. తెలంగాణకు వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడ కాసేపు ఆగి సేద తీరి తిరిగి వెళుతూ ఉంటారు.