సన్‌ఫ్లవర్ గింజలతో.. మీ ముఖానికి కొత్త మెరుపు!

March 12, 2024

TV9 Telugu

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. మొటిమల నివారణ, మృతకణాల తొలగింపులో ఇవి భేష్‌..

అంతేకాకుండా ఇలాంటి ఎన్నో చర్మ సమస్యలన్నిటికీ పొద్దు తిరుగుడు గింజలతో చెక్ పెట్టచ్చట. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ గింజలతో తయారుచేసిన స్క్రబ్ ఉపయోగించడం ద్వారా చర్మరంధ్రాలు శుభ్రపడి కొత్త కళ సంతరించుకొంటుంది

స్క్రబ్‌ ఎలా తయారు చేసుకోవాలంటే.. అరకప్పు పొద్దుతిరుగుడు గింజలను తీసుకొని మిక్సీలో వేసి పొడిలా తయారుచేసుకోవాలి. దీనికి కొద్దిగా నీరు కలిపి చిక్కటి మిశ్రమంలా చేసుకొని గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి

ఈ మిశ్రమంతో రోజూ ముఖాన్ని, మెడను స్క్రబ్ చేసుకుంటే చర్మం శుభ్రపడటంతో పాటు తగిన పోషణ అంది ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొద్దుతిరుగుడు గింజలతో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు

ముందుగా పొద్దుతిరుగుడు గింజలను రెండు నుంచి మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిలా మరీ మెత్తగా కాకుండా.. కాస్త గరుకుగా ఉండేలా పొడి చేసుకోవాలి

దీన్ని గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ పొడిని టీస్పూన్ పరిమాణంలో తీసుకొని అందులో మరో టీస్పూన్ వెన్న తొలగించని పాలు, చిటికెడు పసుపు వేసి కలపాలి

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే సరి. ఈ ప్యాక్ ముఖంపై పేరుకొన్న మురికిని తొలగించి, చర్మానికి తేమనందించి పొడి చర్మం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది

అలాగే చర్మఛాయను సైతం మెరుగుపడుతుంది. ఈ ప్యాక్‌ని వారానికోసారి వేసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. సన్‌ఫ్లవర్ గింజల్లోని పోషకాలు ముఖ చర్మానికి పోషణనిచ్చి అందాన్ని రెట్టింపు చేస్తాయి