ఒకప్పుడు చిన్నారులు స్కూల్ అవ్వగానే గ్రౌండ్‌లో ఆడుకునే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఆట అనేదే మర్చిపోయారు.
టీవీలు, స్మార్ట్ ఫోన్స్, విపరీతమైన హోం వర్క్ కారణం ఏదైనా.. గంటల తరబడి కూర్చునే ఉంటున్నారు. దీంతో చిన్నారుల్లో కూడా శారీరక శ్రమ తగ్గిపోతోంది.
అయితే పిల్లల్ని చిన్నప్పుడు ఇలాగే వదిలేస్తే తీవ్ర ప్రభావం ఎదుర్కునే అవకాశాలు ఉంటాయని, గంటల తరబడి కూర్చునే చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
చిన్నతనంలో శారీరక శ్రమ లేనివారిలో పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు భారీగా ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న ఫిన్‌లాండ్ అధ్యయనంలో తేలింది.
అయితే ఇలాంటి వారిలో బరువు, రక్తపోటు సాధారణంగానే ఉన్నా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సుమారు 30 ఏళ్లుగా నిర్వహించిన అధ్యయనం తర్వాత ఈ విషయాలు వెల్లడించారు.
సర్వేలో తేలిన అంశాల ప్రకారం.. 11 ఏళ్ల వయసులో రోజుకు సగటున చిన్నారులు 362 నిమిషాలు కదలకుండా ఉంటున్నట్లు గుర్తించారు.
అయితే కదలకుండా ఉండే సమయం పెరుగుతున్నా కొద్దీ.. ఎడమ జఠరిక ద్రవ్యరాశీ పెరుగుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ఇలా పెరిగిన వారికి దీర్ఘకాలంలో గుండె జబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతుననట్లు గతంలో చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.