టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లలో 1000 బస్సులు.!
తెలంగాణ ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా 3 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది.
ఆ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా రాష్ట్రంలోని ప్రతీ బస్ స్టేషన్‌లో ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ఆర్టీసీ.
ఈ నెల 29, 30, 31 తేదిల్లో ప్రతి రోజు 1000 బస్సుల చొప్పున పలు మార్గాల్లో తిరగనున్నాయని టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల రూట్లలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ఆయా రూట్లలో ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.
జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ బస్ స్టేషన్‌లలో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి.. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని.. ఒక్క రోజే రూ. 20 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. అదే స్పూర్తితో ఈసారి కూడా పని చేయాలని సజ్జనార్ అధికారులకు తెలిపారు.
టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరుగుతుందని సజ్జనార్ తెలిపారు.
ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in, 040-69440000, 040-23450033 నెంబర్లకు ప్రయాణీకులు సంప్రదించాలని సజ్జనార్ తెలిపారు.
రాఖీ పౌర్ణమి రోజున ఏ ప్రయాణీకుడు ప్రైవేటు వాహనాలలో వెళ్లి ఇబ్బందులు గురికావొద్దు అని.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని సజ్జనార్ స్పష్టం చేశారు.