మనం రోజంతా చురుగ్గా ఉండాలంటే పొట్ట ఆరోగ్యం చాలా ముఖ్యం. పొట్టలో ఏమాత్రం గడబిడ వచ్చినా ఏ పనీ చేయలేం. అయితే కొన్ని అలవాట్లు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కచ్చితంగా వీటికి దూరంగా ఉండాలి. అవేంటంటే..
కొంతమంది రాత్రి నచ్చిన సమయంలో నిద్ర పోతారు. అలా చేయడం ఆరోగ్యానికి చాలా నష్టం. ప్రతిరోజూ నిద్రా సమయాలను కచ్చితంగా పాటించకపోతే మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
కొంతమంది రాత్రి భోజనం మానేయడం, అర్ధరాత్రి పూట తినడం, రాత్రిపూట భారీ ఆహారాలను తినడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవి పొట్టలో అసౌకర్యాన్ని, అజీర్ణాన్ని కలిగిస్తాయి. అలాగే యాసిడ్ రిఫ్లెక్స్ కు కారణం అవుతాయి.
నిద్ర సరిగా పట్టకపోయినా, ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది కూడా పొట్ట ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. కాబట్టి అర్ధరాత్రి వరకు లేచి ఉండడం లేదా అర్ధరాత్రి పూట ఆహారాలను తినడం వంటి అలవాట్లను మానేయాలి.
సమయానికి భోజనం చేయకపోవడం, ఆహారం లేకుండా ఎక్కువ గంటల పాటు ఉండడం వంటివి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇది పొట్ట ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా తినండి. రోజంతా శక్తిని ఇచ్చేది అల్పాహారమే. అలా అని ఏది పడితే అది బ్రేక్ ఫాస్ట్‌లో తినకూడదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.
ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు రక్షణగా ఉంటుంది. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం అంటే సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
మీరు ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది గట్ బ్యాక్టీరియాను అతలాకుతలం చేస్తుంది. పొట్టలో తిమ్మిరిగా అనిపించడం, ఉబ్బరంగా అనిపించడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.